అంతా అనుకొన్నదే జరిగింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియామకాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగిసింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచీ సమర్థుడైన హెడ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. కోచ్ పదవికి చాలా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం గంభీర్ వైపు మొగ్గు చూపించింది. ఇతర సహాయ కోచ్‌లను ఎంపిక చేసే అధికారం తనకే ఉండాలని గంభీర్ ఓ కండీషన్ పెట్టాడు. దానికి బీసీసీఐ అంగీకరించింది. దాంతో గంభీర్ ఆగమనం సుగమం అయ్యింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, 3 టీట్వంటీల సిరీస్ నుంచి గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
”మళ్లీ సొంత గూటికి చేరినట్టైంది. భారతజట్టుకు సేవలు అందించడం గర్వకారణం. దేశమొత్తం గర్వించేలా జట్టుని తీర్చిదిద్దుతా. కోట్లాదిమంది భారతీయుల కలల్ని నిజం చేస్తాం” అని గంభీర్ ప్రకటించాడు. మైదానంలో గంభీర్‌ది దూకుడైన స్వభావం. అయితే.. కోచ్ గా మాత్రం విభిన్నంగా కనిపిస్తాడు. ఐపీఎల్ లో కొలకొత్తాని ప్రశాంతంగా విజయపధం వైపు పడిపాడు. ఆ అనుభవం ఇప్పుడు పనికొస్తుంది. గంభీర్ జట్టులో కొత్త రక్తాన్ని ఎక్కించే పనిలో ఉన్నాడు. ఈ మేరకు బీసీసీఐకి ముందే సంకేతాలు ఇచ్చాడు. అందుకే టీ 20కు కోహ్లీ, రోహిత్ శర్మలు గుడ్ బై చెప్పారు. త్వరలోనే వన్డేలకూ వాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్లతో జట్టుని గంభీర్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం.