వైసిపి నేత గౌతం రెడ్డి వంగవీటి రంగా పై చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. వంగవీటి రంగా ని కించపరిచినట్టుగా ఆ వ్యాఖ్యలు ఉండటం తో ఉద్రిక్తతకి దారి తీసాయి. అదే సమయం లో వైసిపి పార్టీ లో వర్గపోరు కి కారణమయ్యాయి. ఇక వైసిపి అధినేత ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలుస్తాడో, ఏ వర్గాన్ని వదులుకుంటాడో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వివరాల్లోకి వెళితే ..
వైసిపి నేత గౌతం రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వంగవీటి రంగా ని చంపడం లో తప్పేముంది, ఇంట్లోకి పాము చొరబడితే చంపాల్సిందే కదా అన్నట్టు వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో వంగవీటి రాధ, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి ప్రెస్ మీట్ పెట్టాలని బయటికి వస్తే, పోలీసులు రాధా ని హౌస్ అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు. దీంతో రాధా రంగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అక్కడ పోలీసులు మోహరించడం, తోపులాట జరగడం తో రత్నకుమారి సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఆవిడని ఆసుపత్రి కి తీసుకెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడం తో రాధ కంటతడి పెట్టారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెప్తున్నప్పటికీ ,మొత్తానికి మొగల్రాజపురం లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
అయితే ఈ ఇద్దరు నేతలూ వైసిపి కి చెందిన వారే కావడం తో జగన్ కి మరొక తలనొప్పి వచ్చి పడ్డట్టయింది. ఈ ఇద్దరిలో ఎవరిని సముదాయిస్తారు, ఎవరిని ఖండిస్తారో తెలీట్లేదు. బహుశా గౌతం రెడ్డి కి వైసిపి అధిష్టానం షో కాజ్ నోటీస్ ఇవ్వచ్చని భావిస్తున్నప్పటికీ ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన వైసిపి వర్గాల్లో కనిపిస్తోంది.