రాజకీయాల్లో ఆవేశాలు ఉండవు! ఒకవేళ ఉన్నా, వాటి వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుంది. ఇప్పుడు బెజవాడ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఎలాంటి సమయం, సందర్భం లేకపోయినా వంగవీటి రంగాని ఉద్దేశించి వైకాపా నాయకుడు గౌతమ్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగా అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వంగవీటి రాధ, రత్నకుమారి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం, వారిని పోలీసులు అడ్డుకోవడం, కామెంట్స్ చేసినవారిపై చర్యలేవీ అంటూ వారు డిమాండ్ చేయడం… ఇదంతా హైడ్రామా నడిచింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైకాపా కూడా వెంటనే చర్యలకు దిగి గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఇంతకీ, ఏ ఉద్దేశంతో గౌతమ్ రెడ్డి ఇలా చేశారు..? వైకాపా నుంచి బయటకి వెళ్లిపోవాలనే ఇలాంటి పరిస్థితి కోరి తెచ్చుకున్నారా..? ఈ వివాదం వెనక ఆయన రాజకీయ వ్యూహం ఏంటీ..? ఇలాంటి అంశాలపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గౌతమ్ రెడ్డి వివాదం తెరమీదికి వచ్చాక.. భాజపా వైపు కొంతమంది అనుమానంగా చూస్తున్నారు! ఎందుకంటే, ఏపీలో భాజపా విస్తరణ దశలో ఉంది. రాష్ట్రంలో కీలకమైన కాపు సామాజిక వర్గంతోపాటు ఇతర వర్గాల నుంచి కొంతమంది నేతల్ని పార్టీలోకి తీసుకుని రావాలని ప్రయత్నిస్తోంది. భాజపా నేత కన్నా లక్ష్మీ నారాయణతో గౌతమ్ టచ్ లో ఉంటున్నారనీ, ఆ పార్టీలో చేరిక వైపుగా గౌతమ్ అడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అందుకే, ఏదో ఇలాంటి వివాదాన్ని కోరి రేకెత్తించి, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. నిజానికి, ఈ మధ్య వైకాపాలో ఆయన కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారు. గౌతమ్ పనితీరు సరిగా ఉండటం లేదన్న ఉద్దేశంతో విజయవాడ సెంట్రల్ పార్టీ బాధ్యతల్ని రాధాకు అప్పగించారు జగన్. అక్కడి నుంచే తనకు ప్రాధాన్యత తగ్గిందనే ఆవేదనలో పడ్డారు. ఆ తరువాత, మల్లాది విష్ణు కూడా వైకాపాలో చేరారు. అది గౌతమ్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను ఇంత అసంతృప్తిగా ఉంటున్నా కూడా పార్టీ తన ఆవేదనను అర్థం చేసుకోలేదనేది గౌతమ్ రెడ్డి ఫీలింగ్!
అయితే, వైకాపా నుంచి బయటకి వెళ్లిపోవడానికి ఇదే సరైన వ్యూహమా..? అంటే, కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే, ఇంత వివాదం చెలరేగిన తరువాత, ఒక సామాజిక వర్గంలో గౌతమ్ రెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. ఇంతగా ప్రజా వ్యతిరేకత పెంచుకున్న ఏ నాయకుడినైనా ఏ పార్టీలైనా ఎందుకు పిలిచి కండువా కప్పుతాయి..? గౌతమ్ రెడ్డి వివాదాన్నిమోసేందుకు ఏ పార్టీలైనా ఎందుకు సిద్ధంగా ఉంటాయి..? వైకాపాలో తనకు గుర్తింపు లేదనుకుంటే, ఎలాంటి హడావుడి చేయకుండానే వేరే పార్టీలో చేరొచ్చు. కానీ, ఈలోగా తన ఉనికి ఏంటో చాటుకుని వెళ్దామని అనుకోవడంతో… గౌతమ్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.