ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలీసుల తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నా.. రెండు సార్లు డీజీపీ హైకోర్టు ఎదుట హాజరైనా.. వారి తీరులో మార్పు రాలేదనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా… రాయలసీమతో పాటు పల్నాడులో అనేక ప్రాంతాల్లో అనేక ఘటనలు వీడియోలతో సహా మీడియా ప్రసారం చేస్తూంటే… డీజీపీ సవాంగ్ మాత్రం.. చాలా తేలిగ్గా స్పందించారు. అన్నింటిపై నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్పారు. అదే సమయంలో… చిత్తూరు జిల్లాలో ఓ మహిళ నుంచి వైసీపీ నేతలు నామినేషన్స్ లాక్కుంటున్నారని ప్రచారం చేశారని.. ఆమె చుట్టూ ఉంది.. టీడీపీ కార్యకర్తలేనని విచారణలో తేలిందని.. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారో లేదో కానీ.. దాని గురించి వెంటనే చెప్పేసిన పోలీస్ బాస్.. ఇతర అరాచకాల గురించి ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదో మాత్రం చాలా మందికి అర్థం కావడం లేదు.
పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు, ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తున్నామని చెప్పుకొస్తున్నారు కానీ… అసలు దాడులు జరగకుండా ఏం చేస్తున్నారన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మాచర్ల హత్యాయత్నం కేసులో..నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి నామినేషన్లు అయ్యే వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నదానిపై డీజీపీ భిన్నమైన సమాధానం చెప్పారు. మాచర్ల దాడి నిందితులపై 307 సెక్షన్ కింద కేసు పెట్టామని ..నిందితుల్ని అరెస్ట్ చేశాం.. రిమాండ్ విధించారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో అనేక ఘటనల్ని బాగా ప్రచారం చేస్తున్నారని.. చిన్న ఘటనలపైనా అందర్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని డీజీపీ అంటున్నారు. జరుగుతున్న ఘటనలు కాకుండా.. ప్రచారం చేయడమే… డీజీపీకి ఇష్టం లేకపోయినట్లయింది.
ఇలా డీజీపీ ప్రెస్మీట్ ముగియగానే అలా.. చంద్రబాబు ఆయనపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఖాకీ టెర్రరిజం నడుస్తోందని మండిపడ్డారు. ఖాకీ డ్రెస్ వేసుకుని తప్పుడు పనులు చేస్తున్నారని .. పోలీసులు వైసీపీ డ్రెస్ వేసుకుని రావాలని సవాల్ చేశారు. ఎంపీటీసీ ఇళ్లకు వెళ్లి బెదిస్తున్న వీడియోలను చంద్రబాబు విడుదల చేశారు. ఇప్పుడు గోడ దూకి దొంగతనంగా ఇంట్లోకి వెళ్లిన వాళ్లు.. రేపు గోడదూకి వచ్చి హత్యలు, మానభంగాలు చేస్తారని .. ప్రజలు ఛీకొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి పోలీసులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందో డీజీపీ చెప్పాలన్నారు. వివేకా హత్య వెనుక ఉంది ఇంటి దొంగలే అని ప్రపంచం అంతా తెలుసు కానీ ఏంచేయగలిగారనన్నారు. డీజీపీ… ఏం జరిగినా నిమిత్తమాత్రుడినన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విపక్ష పార్టీలు మాత్ర విరుచుకుపడుతున్నాయి.