మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన చిత్రం ‘గాయత్రి’. ఇందులో విష్ణు, శ్రియ జంటగా నటించారు. విష్ణుతో పోల్చుకుంటే.. శ్రియ సీనియర్. వయసులోనూ కాస్త పెద్దగా కనిపిస్తుంది. శ్రియని కథానాయికగా ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసేదే. అయితే చిత్రబృందం మాత్రం ‘ఆ పాత్రని శ్రియ తప్ప ఇంకెవ్వరూ పోషించలేరు’ అని కితాబులు ఇస్తోంది. నిజానికి శ్రియ పాత్ర కోసం చాలా ప్రత్యామ్నాయాలు వెదికారు. ఓ దశలో బాలీవుడ్ సీనియర్ కథానాయిక కాజోల్నీ సంప్రదించారు. అయితే.. కాజోల్ ఈ దశలో తెలుగు సినిమా చేయడానికి అంతగా ఉత్సాహం చూపలేదని తెలుస్తోంది. మాధురీ దీక్షిత్‌ని కూడా పరిశీలించారు. చివరికి శ్రియ దగ్గర ఆగారు. ఈ విషయాన్ని విష్ణునే చెప్పుకొచ్చాడు. ”శ్రియ పాత్ర కోసం చాలా ఆప్షన్లు వెదికాం. ఓ సీరియర్ కథానాయిక ఆ పాత్రలో కనిపించాలన్నది మా ఉద్దేశం. అందుకోసం కాజోల్‌ని సంప్రదించాం. కానీ కుదర్లేదు. శ్రియని తీసుకుంటే బాగుంటుంది అని మా ఆవిడ సలహా ఇచ్చింది. మాకూ శ్రియ అయితేనే బాగుంటుందనిపించింది. చివరికి ఆమెనే ఎంచుకున్నాం” అంటున్నాడు విష్ణు. నిజంగానే కాజోల్, మాధురీ దీక్షిత్లలో ఎవరిని ఎంచుకున్నా ఈ సినిమా రేంజ్ ఓ స్థాయిలో ఉండేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. శ్రియ ఆ పాత్రలో ఎంత వరకూ మెప్పించిందో చూడాలి.