హైకోర్టు విభజనలో గందరగోళం ఏర్పడింది. డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్రం… జనవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని తేల్చేసింది. అంటే.. ఈ మధ్య కాలంలో ఐదు రోజులు ఉన్నాయి. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా పూర్తయింది. కానీ.. నాలుగు రోజుల్లో కార్యకలాపాలు నిర్వహించేంత స్థాయిలో రెడీ కాలేదు. రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావడమే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసే ముందు కొంత ప్రక్రియ నడవాల్సి ఉంటుదని.. ఏపీలో హైకోర్టు భవనం, జడ్జిన నివాసాలు, ఇతర మౌలిక సదుపాయాలపై… క్లారిటీ తీసుకోవాల్సి లేకుండా… మీ బాధలు మీరు పడండన్నట్లుగా.. న్యాయమూర్తుల్ని కూడా కేటాయిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి ఇందులోనూ కొన్ని తేడాలున్నాయి. సుప్రీంకోర్టు కొలిజియం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఈ గందరగోళం.. హైకోర్టులోనూ కనిపించింది. న్యాయవాదుల ప్రశ్నలతో గందరగోళం ఏర్పడటంతో చీఫ్ జస్టిస్ బెంచ్ దిగి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. అటు హైకోర్టు ఆవరణలోనూ విభజనపై న్యాయవాదుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి కేసులపై స్పష్టతపై లేదని కొందరు న్యాయవాదులు వాదిస్తున్నారు. సిబ్బంది, దస్త్రాల విభజన జరగలేదని, ఏపీలో కొత్త భవనాలు ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులు చెబుతున్నారు. అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేసి.. అక్కడికి తరలివెళ్లే విషయంలో గడువు ఇవ్వకపోవడంపై న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ హైకోర్టు పనిచేసే ప్రారంభ తేదీని నిర్థారించే విషయంలో ఉమ్మడి హైకోర్టును సైతం కేంద్రం అభిప్రాయం కోరలేదని మండి పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి జారీచేసే ప్రకటనలో మూడు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రస్తావన లేకపోవడం న్యాయవాద వర్గాల్ని సైతం ఆశ్చర్య పరిచింది.
పరిష్కారం కోసం కొన్ని సమస్యలను ప్రధానంగా.. న్యాయవాదులు, న్యాయాధికారులు ప్రస్తావిస్తున్నారు. సిబ్బంది, కేసుల్ని విభజించలేదు. తెలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న కేసుల్ని ఏ కోర్టుకు బదలాయిస్తారో తెలియదు. ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి లేదా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించే అంశంపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనవరి ఒకటి లోపు సాధ్యంకాదు. చీఫ్ జస్టిస్ లేకుండా.. హైకోర్టు ఎలా ఏర్పడుతుందనే ఆందోళన న్యాయవర్గాల్లో ఉంది.