ఈనెలలో బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. చిరంజీవి భోళా శంకర్ బోల్తా కొట్టడంతో – నీరసాలు వచ్చేశాయి అందరికీ. గత వారం సినిమాలొచ్చినా, పెద్దగా అలికిడి లేదు. ఈవారం మాత్రం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మూడింటికీ.. ఎంతో కొంత క్రేజ్ ఉండడంతో ఈ వారం థియేటర్లు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరుణ్‌తేజ్ `గాంఢీవధారి అర్జున` ఈ వారమే విడుదల అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ప్రవీణ్ ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఊహించడం కష్టం. వరుణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. గరుడ వేగ టింజ్.. ఉంది. వరుణ్‌కి యాక్షన్ కథతో హిట్టు కొట్టాలని ఆశ. మరి ఈసారైనా తీరుతుందో లేదో చూడాలి.
యుగాంతం కాన్సెప్టులో రూపొందించిన చిత్రం `బెదురులంక 2012`. కార్తికేయ హీరో. తనకి కొంతకాలంగా హిట్టు లేదు. కాకపోతే కాస్త కొత్త పాయింట్, హ్యూమన్ ఎమోషన్స్ తో తీసిన విలేజ్ డ్రామా కావడంతో మినిమం గ్యారెంటీ కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మణిశర్మ సంగీతం అందించారు. ఒకట్రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. అదృష్టం కలిసొస్తే.. కార్తికేయ ఖాతాలో ఓ హిట్టు పడడం కష్టమేం కాదు.
వీటితో పాటు ఓ డబ్బింగ్ సినిమా విడుదల అవుతోంది. అదే.. `కింగ్ ఆఫ్ కొత్త`. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా ఇది. దుల్కర్ అనగానే లవ్ స్టోరీలే గుర్తొస్తాయి. అయితే.. తొలిసారి పూర్తి స్థాయి మాస్ కథ చేశాడు. అందులోనూ గ్యాంగ్ స్టర్ సెటప్‌తో. ఈ సినిమాని తనే నిర్మాత కావడం విశేషం. తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఈ సినిమా కోసం కష్టపడ్డానని చెబుతున్నాడు దుల్కర్. ఆకష్టం ఫలిస్తే… మరో డబ్బింగ్ సినిమాకి తెలుగులో కాసులు కురిసినట్టే.