సుమారు 15 ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ లో ప్రవేశించిన మూగ మరియు చెవుడు బాలిక గీతను ఇంతవరకు ఆమె బాగోగులు చూసుకొన్న ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు నిన్న డిల్లీకి తీసుకువచ్చి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు అప్పగించారు. ఆమెకు, ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు డిల్లీలో ఘనస్వాగతం లభించింది. అనంతరం వారందరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆయన కూడా వారిని చాలా ఆదరించారు. ఆయన చూపిన ఆదరణ చూసి గీత చాలా పొంగిపోయింది. ఇంతకాలం గీతను కంటికి రెప్పలా చూసుకొంటూ పెంచిన ఈధీ ఫౌండేషన్ సంస్థకు ప్రధాని కోటి రూపాయలు విరాళం ఇచ్చేరు. ఇంతవరకు కధ చాలా సాఫీగానే సాగినప్పటికీ ఆఖరు నిమిషంలో గీత దానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఆమె పాకిస్తాన్ లో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పంపించిన ఫోటోలలో బీహార్ రాష్ట్రానికి చెందిన జనార్ధన్ మహతోను తన తండ్రిగా గుర్తించింది. ఆ ఫోటోలో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులను కూడా తన సోదరుడు అక్క చెల్లెళ్ళుగా గుర్తించింది. ఆ తరువాతే ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు ఆమెను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించేందుకు డిల్లీకి తీసుకువచ్చెరు. కానీ ఆమె ఇప్పుడు జనార్ధన్ మహతో తన తండ్రి కాదని భావిస్తోంది. కనుక ఆయనతో వెళ్లేందుకు నిరాకరించింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను జనార్ధన్ మహతో కుటుంబానికి అప్పగించే ముందు ఆమెకు, ఆమె తండ్రికి డి.ఎన్.ఎ.పరీక్షలు నిర్వహించి ఆమె మహతో కుమార్తె అని దృవీకరించుకోవాలని ముందే అనుకొన్నారు కనుక ఎ.యిమ్స్. వైద్య బృందం ఆమెది, ఆమ తండ్రిది రక్తం సేకరించి డి.ఎన్.ఎ.పరీక్ష కోసం ఎయిమ్స్. ఆసుపత్రికి పంపారు. అయితే గీత తన తండ్రిని గుర్తించలేకపోతోంది కనుక ఆమెను తాత్కాలికంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ఉన్న మహిళల వసతి గృహంలో ఉంచాలని ఉన్నతాధికారులు అధికారులు నిర్ణయించారు. కానీ ఒకవేళ వారి డి.ఎన్.ఎ. సరిపోతే అప్పుడు గీతను, ఆమె కుటుంబ సభ్యులతో వరుసగా కొన్ని సార్లు సమావేశపరిచి ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. లేకుంటే ఆమె తల్లి తండ్రులమని చెప్పుకొంటూ ముందుకు వచ్చిన మిగిలిన వారి అందరికీ డి.ఎన్.ఎ. పరీక్షలు నిర్వహించి వారిలో ఆమె అసలయిన తల్లి తండ్రులు ఎవరయినా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.