బేబీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం చిన్న నిర్మాతలకు కొండంత ఆత్మవిశ్వాసం అందింది. వాళ్లే కాదు, బడా బ్యానర్లు కూడా ఇప్పుడు చిన్న సినిమాలపై విరివిగా దృష్టి పెట్టాయి. ఈ సినిమాతో అత్యంత ఎక్కువగా లాభపడింది గీతా ఆర్ట్స్. ప్రత్యక్షంగా ఈ సినిమాకీ, గీతా ఆర్ట్స్‌కి సంబంధం లేదు. కానీ పరోక్షంగా పెట్టుబడి పెట్టింది గీతా ఆర్ట్సే. లాభాల్లో 60 శాతం వాటా కూడా ఎత్తుకుపోయింది. పెట్టిన పెట్టుబడి ఓటీటీ రూపంలో వచ్చేసింది. దాని తరవాత వచ్చిన ప్రతీ రూపాయిలోనూ 60 పైసలు అందుకొంది. గీతా ఆర్ట్స్ తీసిన చిన్న సినిమాలు దాదాపుగా అన్నీ ఫట్టే. కానీ… బేబీ మాత్రం కొండంత లాభాన్ని ఇచ్చింది. ఈ స్ఫూర్తితో గీతా ఆర్ట్స్ మరిన్ని సినిమాలకు పెట్టుబడి అందించాలని భావిస్తోంది. చిన్న చిన్న కథలు, కాంబినేషన్లు సెట్ చేసి, తెర వెనుక పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడిని ఓటీటీ హక్కుల రూపంలో రాబట్టుకోవాలన్నది గీతా ఆర్ట్స్ ప్లాన్. చేతిలో ఆహా ఎలాగూ ఉంది. ఆహాకి కంటెంట్ కావాలి. ఎవరివో సినిమాల్ని కొనుక్కోవడం కంటే, ఇలా ఓ కథని నమ్మి, దానిపై పెట్టుబడి పెట్టి, ఓటీటీ హక్కుల్ని రాయించుకోవడం సబబు అని గీతా ఆర్ట్స్ నమ్ముతోంది. సినిమా పోతే, బ్యానర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఓటీటీ హక్కులు రాసుకొని చేతులు దులుపుకొంటారంతే. హిట్టయితే మాత్రం గీతా ఆర్ట్స్ ముందుకొస్తుంది. పబ్లిసిటీ చేసి పెడుతుంది. లాభాలూ అందుకొంటుంది. ఇదీ.. గీతా ఆర్ట్స్ మాస్టర్ మైండ్. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాలుగు చిన్న సినిమాలు తయారవుతున్నాయని టాక్. అన్నీ పరిమిత బడ్జెట్ లో పూర్తయ్యేవే. మరి ఇందులో బేబీలు ఎన్నుంటాయో చూడాలి.