పరిశ్రమలో దర్శకత్వ అవకాశాల కోసం ఎగబడుతున్నవాళ్లు, దర్శకుడిగా తొలి అడుగులోనే హిట్టు కొట్టిన కుర్రవాళ్లకు ఎర వేస్తోంది గీతా ఆర్ట్స్. అవును… గీతా ఆర్ట్స్‌లో రోజుకు ఇద్దరు ముగ్గురు కొత్త దర్శకులు కథలు పట్టుకొని ప్రత్యక్ష్యం అవుతున్నారు. దానికీ కారణం ఉంది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్ ల కోసం గీతా ఆర్ట్స్ కొత్త కథలు వింటోంది. కథ నచ్చితే…. పరిశ్రమలో ఉన్న ఏ హీరోతో అయినా సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్ రంగం సిద్దం చేసుకొంటోంది. నిర్మాణంలో అపారమైన అనుభవం గడించిన అల్లు అరవింద్… ఇప్పుడు చిత్ర నిర్మాణాన్ని మరింత ముమ్మరంగా సాగించాలని అనుకొంటున్నార్ట. దాంతో పాటు బన్నీ వాసు కూడా.. ఆ క్యాంపులోని వ్యక్తే. కాబట్టి… కొత్త కథలు విని, వాటిని లాక్ చేసుకోవాలని భావిస్తోంది.
అలా గీతా ఆర్ట్స్ దగ్గర ఇప్పటికే పది కథలు సిద్దంగా ఉన్నాయట. కొత్త దర్శకులే ఎందుకు?? అంటే.. ఏమో చెప్పలేం కదా, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో? అగ్ర హీరోల కోసం కాకపోయినా పరిశ్రమలో ఉన్న శర్వానంద్, నాని, విజయ్ దేవరకొండ లాంటి యూత్ హీరోలకు సెట్ అయ్యే కథలున్నా ఫర్వాలేదంటోందట. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఆకట్టుకొంటున్న యంగ్ హీరోలపైనా గీతా ఆర్ట్స్ దృష్టి పెడుతోందని సమాచారం. ప్రస్తుతం ఆ బ్యాచ్ చెప్పే కథలే వింటోందట గీతా ఆర్ట్స్ క్యాంపు. కొత్త దర్శకులకు ఇదే మంచి అవకాశం కదూ.