టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. ఆమధ్య సినిమాలు తీయడంలో కాస్త బద్దకించిన గీతా ఆర్ట్స్.. ఇప్పుడు మాత్రం ఎప్పుడూ లేనంత జోరుగా సినిమాలు చేస్తోంది. జీ.ఏ 2 కూడా తోడవ్వడంతో… ఆ ఊపు మరింత పెరిగింది. సినిమాలు తీయాలంటే కథలు కావాలి కదా? అందుకే కథల కోసం గీతా ఆర్ట్స్ చాలా కసరత్తులు చేస్తోంది. గీతా ఆర్ట్స్ ఆఫీసు ఇప్పుడు దర్శకులతో, కథకులతో సందడిగా మారింది. రోజుకి పది కథలైనా వింటోంది గీతా ఆర్ట్స్ టీమ్. ఇందుకోసం వి.ఎన్.ఆదిత్య, వాసు వర్మ లాంటి దర్శకులు గీతా ఆర్ట్స్‌కి సహాయం చేస్తున్నారు. ఎవరైనా సరే.. ముందు వీళ్లకే కథ చెప్పాలి. వీరిద్దరూ స్క్రూటినీ చేసి… అల్లు అరవింద్ లేదా, బన్నీ వాసులకు వినిపిస్తారు. అక్కడ ఓకే అయితే… సదరు దర్శకుడికి అడ్వాన్సులు ఇచ్చి, ఆఫీసు రూమ్ కేటాయిస్తున్నారు. ఇలా గీతా ఆర్ట్స్‌లో అడ్వాన్సులు తీసుకుని, కథలు రెడీ చేస్తున్నవాళ్లు దాదాపు పదిమంది కి పైగానే ఉన్నారు. 2019లో గీతా ఆర్ట్స్, జీఏ 2 నుంచి ఏకంగా ఆరేడు సినిమాలైనా పట్టాలెక్కబోతున్నాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో మెగా హీరోలే కాదు, బయటి స్టార్ హీరోలూ నటించబోతున్నారు. చిన్న కథలకు, చిన్న హీరోలకు జీఏ 2 ఎలానూ ఉంది. మొత్తానికి గీతా ఆర్ట్స్.. కథల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేసి – సినిమా నిర్మాణాన్ని మరింత ఉధృతం చేసే ఆలోచనలో ఉంది. పరిశ్రమకు ఇలాంటి సంస్థలే కదా, కావాల్సింది.