గీత గోవిందం సక్సెస్‌లో తలమునకలైపోయింది గీతా ఆర్ట్స్. ఈమధ్యకాలంలో గీతా ఆర్ట్స్ చూసిన భారీ విజయాల్లో ఇదొకటి. రూ.13 కోట్లతో సినిమా తీస్తే… శాటిలైట్ తో కలిపి తొలిరోజే పెట్టుబడి వచ్చేసింది. గురు, శుక్ర, శని, ఆది.. ఈ నాలుగు రోజుల్లో వసూళ్ల వర్షం కొనసాగుతుంది కాబట్టి…. `గీత గోవిందం` భారీ లాభాల్ని అందుకునే అవకాశం ఉంది. అందుకే.. అల్లు అర్జున్ ఈ చిత్రబృందాన్ని పార్టీ మూడ్‌లోకి తీసుకెళ్లిపోదామనుకుంటున్నాడు. శనివారం గీత గోవిందం టీమ్ మొత్తానికి ఓ భారీ పార్టీ ఇవ్వబోతున్నాడు. అందుకోసం హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్‌ని వేదిక చేసుకున్నాడు. లైట్ బోయ్స్‌తో సహా చిత్రబృందం మొత్తం ఈ పార్టీలో పాలు పంచుకోబోతోందని తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. బుధవారమే చిరు ఈ సినిమాని చూశారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సినిమా ముచ్చట్లని ఆదివారం సక్సెస్ మీట్లో చిరు తన అభిమానులతో పంచుకోబోతున్నారు.