తెలుగు360 రేటింగ్: 3.25/5
లైన్లు చాలా పుడతాయి. దాన్నో కథగా మలచి, రెండున్నర గంటల సినిమాగా మార్చి, వెండి తెరపైకి తీసుకొచ్చి, ప్రేక్షకుల్ని బోర్ కొట్టించకుండా కూర్చోబెట్టడం కత్తిమీద సామే. అక్కడే దర్శకుడి తాలుకు తెలివితేటలు, రాతకోతలు బయటపడతాయి. ఖుషి సినిమా చూడండి. హీరో – హీరోయిన్ల మధ్య ఈగో, నడుం సీన్ చుట్టూ కథ నడిపేశారు. ఖుషి కథ ఏమిటి? అని అడిగితే ఏం చెప్పలేం. కానీ ఆసినిమాని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. అదంతా సన్నివేశాల్లో ఉండే మ్యాజిక్. ‘గీత గోవిందం’ ఏమంత గొప్ప కథ కాదు. ఆమాటకొస్తే కథే కాదు. ఓ అబ్బాయి.. ఓ అమ్మాయి. అబ్బాయి మంచోడే. కానీ అమ్మాయి దృష్టిలో మాత్రం ఓ రోడ్ సైడ్ రోమియో. వాళ్లిద్దరి మధ్య మొదలైన చిన్న అపార్థం… ఎన్ని మలుపులకు, ఎన్ని తగువులకు కారణమైందన్నదే కథ. దాన్ని ఇంకొంచెం డిటైల్డ్‌గా చెప్పుకోవాలంటే..
కథ
విజయ్ గోవిందం… చాలా మంచోడు. ఈ కాలంలో ఉండాల్సిన అబ్బాయైతే కాదు. చాగంటి ప్రవచనాలు వింటూ, భారతీయుడు సినిమా చూస్తూ… 1980 నాటి ఆలోచనలతో కాలం వెళ్లదీస్తుంటాడు. తన స్టూడెంట్ కన్నుకొట్టినా, ప్రపోజ్ చేసినా ఏమాత్రం పట్టించుకోడు. అలాంటి మంచి అబ్బాయి… గీతని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో గీత.. గోవింద్‌ని అపార్థం చేసుకోవాల్సివస్తుంది. అప్పటి నుంచి గోవింద్ ఏం చేసినా, చేయకపోయినా.. గీత ముందు దోషిగా నిలబడాల్సివస్తుంది. చేయని తప్పుకు, ప్రేమించిన అమ్మాయి ముందు తలవొంచి, తన ఆర్డర్లని శిరసా పాటించి.. ఆమె వెనుకే తిరాగాల్సివస్తుంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు గోవింద్ చేసిన తప్పేంటి? గీత అపార్థాలు ఎలా తొలగిపోయాయి? అనేదే కథ.
విశ్లేషణ
‘ఆబ్జెక్ట్ ఇన్ మిర్రర్.. క్లోజర్ దేన్ అపీయర్’
– గీత గోవిందం ఇంట్రవెల్ కార్డ్ ఇది. అంటే.. అద్దంలోని ప్రతిబింబం వాస్తవానికంటే దగ్గరగా ఉంటుంది` అని అర్థం.
ఈ క్యాప్షన్‌ని భలే తెలివిగా వాడుకున్నాడు దర్శకుడు. ఈ కథకు ఆ కొటేషన్ సూటబుల్ కూడా. ప్రతిబింబం ఎప్పుడూ నిజమే. కానీ వాటిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఈ కథలో కథానాయిక కథానాయకుడ్ని అలానే అపార్థం చేసుకుంటుంది. ఆ పాయింట్ చుట్టూనే దర్శకుడు ఈ కథని నడిపించాడు. చెప్పుకోవడానికి రాసుకోవడానికి చాలా చిన్న లైన్ అది. స్క్రీన్ ప్లే ఏమాత్రం తేడా కొట్టినా, సన్నివేశాల్లో ఏమాత్రం బలం లేకపోయినా.. ఈ కథ నాలుగో సీన్లోనే తేలిపోతుంది. పరశురామ్ మంచి రచయిత. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నోడు. అందుకే… తన బలాల్ని ఉపయోగించుకుంటూ ఈ సున్నితమైన కథకు పునాదులుగా మార్చుకున్నాడు. ఏ సన్నివేశంలోనూ డెప్త్ ఉండదు. మాటలతో, సరదా ఎక్స్‌ప్రెషన్స్‌తో మ్యాజిక్ చేశాడు. దాంతో.. సీన్‌ని సీన్‌గా చూసి ప్రేక్షకుడు ఎంజాయ్ చేయడం మొదలెడతాడు. సినిమాని వినోదాత్మకంగా దర్శకుడు ఎప్పుడు తీసుకెళ్లడం మొదలెట్టాడో, ప్రేక్షకుడు లాజిక్ల దృష్టికి వెళ్లడు. `పోలీస్ కమీషనర్ చేతిలో ఉన్నా..బస్సు ప్రయాణికుల లిస్టు సంపాదించలేకపోయాడా` అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో మెదిలినా… తన హ్యూమర్‌తో దాన్ని కూడా మర్చిపోయేలా చేస్తాడు.
హీరో క్యారెక్టరైజేషన్‌లోనే కావల్సినంత ఫన్ ఉంది. అందుకే దాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘మేడమ్ మేడమ్.’ అంటూ చిన్నపిల్లాడిలా కథానాయిక వెంట పడుతూ బతిమాలుకోవడం చూస్తే… హీరో పాత్రపై సింపతీ రాదు. హాయిగా నవ్వొస్తుంది. ఒకేసీన్ని రిపీట్ చేస్తున్నా… బోర్ కొట్టదు. ప్రతీసారీ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఈ విషయంలో సగం క్రెడిట్ దర్శకుడికి ఇస్తే… సగం క్రెడిట్ తప్పకుండా విజయ్ దేవరకొండకే ఇవ్వాలి. విజయ్ నుంచి వచ్చిన చిన్న డైలాగ్ కూడా ఆడిటోరియంలో నవ్వులు పంచుతోంది. దానికి కారణం… విజయ్ కామెడీ టైమింగే. ఇలాంటి చిన్న కథల్లో ఉండే ఇబ్బందేంటంటే.. సెకండాఫ్ కాస్త వేగం తగ్గుతుంటుంది. చెప్పడానికి ఏం మిగలక, చెప్పిన విషయాల్నే మళ్లీ చెప్పి, కథని అక్కడక్కడ తిప్పడం మొదలెట్టాక.. కిక్ తగ్గిపోతుంది. ఇలాంటి చోట.. మరో మ్యాజిక్ కావాలి. ఆ మ్యాజిక్ ఈసారి వెన్నెల కిషోర్ చేశాడు. ‘మూలాలు’ తెలిసిన, అతి అమాయకమైన పెళ్లి కొడుకుగా వెన్నెలకిషోర్ని రంగంలోకి దింపి తెలివైన పని చేశాడు పరశురామ్. ‘ఈ వెన్నెల కిషోర్ ఇప్పుడు బకరా అవుతాడు.. చివర్లో హీరోయిన్ని హీరోనే పెళ్లి చేసుకుంటాడు’ అనే సంగతి అర్థమవుతున్నా… ఆయా సన్నివేశాల్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇక్కడే దర్శకుడిలోని రైటింగ్ క్యాపబులిటీ మరోసారి బయటకు వచ్చింది. నిత్యమీనన్‌ని కథ చెబుతున్నట్టు స్క్రీన్ ప్లేని అల్లుకున్నా… నిజానికి ఇలాంటి కథకు ఈ ఎత్తుగడ అవసరం లేదు. విజయ్ దేవరకొండ చూడని, వినని విషయాలు కూడా.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేస్తుంటాయి. సీరియస్‌గా పట్టించుకుంటే అది స్క్రీన్ ప్లే దోషం. కానీ.. అది కూడా కామెడీలో కొట్టుకుపోయింది.
నటీనటులు
విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో ఇది. తన కామెడీ టైమింగ్ చాలా ముచ్చటగా ఉంది. అమాయకత్వం, టెంపరితనం ఇవన్నీ బాగా పలికించాడు. అర్జున్ రెడ్డితో పోలిస్తే… పూర్తి విభిన్నంగా సాగింది విజయ్ నటన. తనకు అండర్ ప్లే చేయడం కూడా తెలుసని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. రష్మిక అందంగా ఉంది. ఫిమేల్ ఈగో చూపించింది. నాగబాబుకి వేరెవరో డబ్బింగ్ చెప్పారు. ఆ గొంతు నప్పలేదు. పైగా ఆ పాత్రకున్న ప్రాధాన్యం కూడా తక్కువే. చివర్లో వచ్చి ఈ సినిమా టెంపో మార్చేశాడు వెన్నెల కిషోర్.
సాంకేతికంగా…
ఇంకేం ఇంకేం కావాలే… అంటూ ఈసినిమాలో పాట విడుదలకు ముందే మార్మోగిపోయింది. అయితే… థియేటర్లో అంత కిక్ రాలేదు. ఆ పాటలోని బీజియమ్ని పదే పదే వాడేసుకున్నారు. పబ్ సాంగ్ కూడా అంతంత మాత్రమే. ఈ సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్లో తీయాలనుకున్నారేమో… మేకింగ్ విషయంలో రాజీ పడ్డారేమో అనిపిస్తుంది. దర్శకుడిగా, రచయితగా పరశురామ్ రాణించాడు. ఎవరి దగ్గర్నుంచి ఏం కావాలో రాబట్టుకోగలిగాడు. డైలాగుల్లో పంచ్ లూ, ప్రాసల కోసం ప్రాకులాడలేదు. సందర్భానికి తగ్గట్టుగానే వినోదం పంచాడు.
తీర్పు
విజయ్ జోరు మామూలుగాలేదు. తను ఇప్పుడు స్టార్ అయిపోయాడు. విజయ్ ఏం చేసినా జనాలకు నచ్చేస్తుంది. తనని తనివి తీరా చూడ్డానికి ‘గీత గోవిందం’కి వెళ్లొచ్చు. హాయిగా నవ్వుకుంటూ ఇంటికి రావొచ్చు. చిన్న చిన్న కథల్నీ, తెలివిగా రాసుకుంటే.. చూడ్డానికి బాగానే ఉంటాయని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
ఫైనల్ టచ్: ‘ఇంకేంమింకేం ఇంకేం కావాలే.. చాల్లే ఇది చాల్లే…’
తెలుగు360 రేటింగ్: 3.25/5