విజయ్ దేవరకొండని వంద కోట్ల హీరోని చేసిన సినిమా ‘గీత గోవిందం’. విడుదలకు ముందే పైరసీకి గురైనా… ఆ ఎఫెక్ట్ కలక్షన్లపై ఏమాత్రం పడలేదు. ఈసినిమాతో విజయ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైపోయాడు. ఇప్పుడు గీతా గోవిందం సీక్వెల్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్క్రిప్టు పనిలోనే దర్శకుడు పరశురామ్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పరశురామ్‌తో మరోసారి పనిచేయడానికి రెడీగా ఉన్న విజయ్… ‘మనం ఈసారి గీతాగోవిందంకి సీక్వెల్ చేద్దాం’ అన్నాడట. దాన్ని సీరియస్ గా తీసుకున్న పరశురామ్… ‘మళ్లీ గీతాగోవిందం’ పేరుతో ఓ కథ సిద్ధం చేసినట్టు.. ఈ సినిమాలోనూ విజయ్ – రష్మిక జంటగా నటించబోతున్నట్టు టాక్. కాకపోతే… విజయ్ ప్రస్తుతానికి ఖాళీగా లేడు. తన కాల్షీట్లు దొరకాలంటే మరో రెండేళ్లయినా ఆగాలి. ఈలోగా పరశురామ్ మరో హీరోతో ఓ సినిమా చేసేయొచ్చు. ఈలోపుగా సమీకరణాలేం మారకపోతే… తప్పకుండా ‘గీతా గోవిందం 2’ చూడొచ్చు.