కాదేదీ.. ప్రచారానికి అనర్హం అనుకొంటుంది చిత్రసీమ. తమ సినిమా పబ్లిసిటీకి ఎన్నిదార్లు ఉంటే అన్ని దార్లూ అన్వేషిస్తుంటుంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా కోసం కూడా అదే చేస్తున్నారు. ‘గీతాంజలి’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో అంజలి హీరోయిన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదో హారర్ సినిమా. అందుకే ప్రమోషన్ ఈవెంట్స్ నీ.. కాస్త సింబాలిక్‌గా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట స్మశానంలో టీజర్‌ని ఆవిష్కరించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.
ఈనెల 24న రాత్రి 7 గంటలకు స్మశానంలో టీజర్ లాంచ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కోన వెంకట్ కథ అందించారు. అప్పట్లో హారర్, కామెడీ జోనర్లో వచ్చిన ‘గీతాంజలి’ పెద్ద హిట్ కొట్టింది. హిట్ సినిమా టైటిల్ ని వాడుకోవాలని తాము చూడడం లేదని, గీతాంజలికి ఇది ప్రాపర్ సీక్వెల్ అని, ఆ కథ ఎక్కడ ఆగిందో, అక్కడ్నుంచి ఈ కథ మొదలవుతుందని చిత్రబృందం చెబుతోంది.