అందాల అభినేత్రి సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన ‘మహానటి’ సినిమాపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి తదితరులంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శకుడు నాగఅశ్విన్ నిజాయితీగా సినిమా తీశాడని చెబుతున్నారు. అయితే… ‘జెమినీ’ గణేశన్ మొదటి భార్య కుమార్తె కమలా సెల్వరాజ్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో తన తండ్రి పాత్రను చిత్రీకరించిన తీరు వేదన కలిగిస్తోందని ఆమె ఓ తమిళ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సావిత్రి బతికున్న రోజుల్లో ఆమె ప్రవర్తించిన తీరుపైనా ఆవేదన చెందారు. ‘మహానటి’ సినిమా గురించి కమలా సెల్వరాజ్ మాట్లాడుతూ “తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లతో పాటు నా తండ్రి ‘జెమినీ’ గణేశన్ కూడా అగ్ర హీరో అని అందరికీ తెలుసు. అటువంటి హీరోని సోమరిపోతుగా, చిన్నచిన్న పనులు చేసే వ్యక్తిగా కించపరిచేలా చిత్రీకరించారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది మా నాన్నే అన్నట్లు చిత్రీకరించడం నన్ను ఎంతగానో బాధించింది. సావిత్రితో కషాల్లో వున్నప్పుడు ఆమెను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని చూపడం అవాస్తవం. ‘ప్రాప్తం’ సినిమా పనుల్లో సావిత్రి బిజీగా వున్నారు. అప్పుడామెను కలిసి తన నిర్ణయం మార్చుకోవాలని చెప్పడానికి నాన్న ఆమె ఇంటికి వెళ్లారు. అప్పుడు నాన్నతో నేనూ వున్నాను. అయితే… వాచ్మెన్ చేత సావిత్రి మమ్మల్ని బయటకు నెట్టించింది. తరవాత మేము ఆ ఇంటి పక్కలకు కూడా వెళ్లలేదు” అన్నారు.