తెలుగు సినిమా ఇండస్ట్రీ చేపట్టిన థియేటర్ల బంద్ కార్యక్రమం ముగిసినట్టు ఈ రోజు నిర్మాతలు డి. సురేష్ బాబు, నిర్మాతల మండలి ఛైర్మన్ పర్వతనేని (జెమిని) కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మరికొందరు నిర్మాతలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. అంతా ముగిసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజకి కౌంటర్ ఇచ్చారు కిరణ్. ఆయన మాటల్లో ఎక్కడా తమ్మారెడ్డి పేరు లేదు. కానీ, మాటలు విన్నవారికి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో ఇట్టే అర్థమవుతుంది.
థియేటర్ల బంద్ చేపట్టిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ తెలుగు దినపత్రికతో మాట్లాడుతూ బంద్‌కి పిలుపు ఇచ్చిన కారణాన్ని తప్పుబట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వున్న ఎన్నో సమస్యలను వదిలేసి.. ఒక్క సమస్య మీద బంద్ చేయడం ఎందుకు? ఎలాగో థియేటర్లు మూసేశారు కాబట్టి… అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని కోరారు. వీటికి తోడు ‘తెలుగు ఇండస్ట్రీలో 28 కోట్ల భారీ స్కామ్?’ (లింక్: https://www.telugu360.com/te/tollywood-28-cr-scam-allegation-associated-producers-telugu/) జరిగిందని ఆరోపించారు.
తమ్మారెడ్డి ఆరోపణలపై నేరుగా స్పందించని కిరణ్, ఆయన పేరు ప్రస్తావించకుండా… “మేం ఐకమత్యంతో సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుంటే కొందరు మీడియా ముందుకొచ్చి ఎన్నో సమస్యలను వదిలేసి ఈ ఒక్క సమస్య మీదే ఎందుకు? అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఒక్కటే చెబుతున్నా.. వచ్చి ఫిల్మ్ చాంబర్లో కూర్చుని సమస్యలేంటో చెప్పండి. ఎలా పరిష్కరిస్తే బాగుంటుందో సూచించండి. అంతే కానీ… మీడియాలో మాట్లాడడం సరికాదు” అని ఆవేశంతో చెప్పారు. ఆయన పక్కన కూర్చున్న డి. సురేష్ బాబు వెంటనే మైక్ అందుకుని… “సమస్యలు పరిష్కరించడానికి గుడ్ లీడర్షిప్, పాజిటివ్ యాటిట్యుట్ థింకింగ్ కావాలి. అంతేకాని విమర్శలు చేయడం కాదు. కిరణ్ ను ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛైర్మన్ చేసిన తర్వాత ఈ సమస్య వుందని గుర్తించాడు. పరిష్కరించడానికి కృషి చేశాం. మీకు ఏమైనా సమస్యలు వుంటే చెప్పండి” అన్నారు. వీటిపై తమ్మారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.