ఎప్పుడో రెండువందల సంవత్సరాల క్రిందట పేదకుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని ఈరోజు (నవంబర్ 2)న గూగుల్ గుర్తుపెట్టుకుని డూడుల్ తో మనసారా స్మరించుకోవడం ఓ విశేషం. గూగుల్ మాత్రమేకాదు, యూనివర్శిటీ కాలేజ్- కార్క్ (యుసిసి) ఏకంగా ఒక వెబ్ సైట్ ని ఆ వ్యక్తికి అంకితమిచ్చింది. ఇంతకీ ఆయనగారి గొప్పసంగతేమిటీ?
ఇవ్వాళ గూగుల్ సెర్చ్ ఇంజన్ కు వెళ్ళినవారంతా ఓ ప్రత్యేకమైన డూడుల్ చూసేఉంటారు. ఆంగ్ల అక్షరాలు ఎక్స్, వైలతో లాజికల్ ఈక్వేషన్స్ సృష్టికర్త జార్జి బూలె. ఆయన ఇంగ్లండ్ లోని ఓ మేథమెటీషియన్. గూగుల్ కావచ్చు, అమేజాన్ కావచ్చు, లేదా మరో ప్రసిద్ధి చెందిన వెబ్ సైట్ కావచ్చు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మహాగణిత మేధావి బూలె. ఆయన గురించి పది విశేషాలు చెప్పుకుందాం.
1. బూలె తండ్రి ఓ షూమేకర్. తల్లి పనిమనిషిగా ఉండేది. జాన్ , మేరీ దంపతులకు 1815 నవంబర్ 2న బూలె జన్మించాడు.
2. కేవలం 16ఏళ్ల వయసులోనే బూలె ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. అయితే, అప్పటికి ఆయనకు టీచర్ అవడానికి సంబంధించిన ప్రాధమిక విద్య పూర్తికాలేదు. అప్పటి నుంచే కుటుంబభారాన్ని కూడా మోయాల్సివచ్చింది. 19ఏళ్ల ప్రాయంలో ఆయన సొంతంగా స్కూల్ ఓపెన్ చేశాడు.
3. బూలె 1855లో మారీ ఎవరెస్ట్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు కుమార్తెలు.
4. గణితశాస్త్రంలో స్వీయ సమీకరణల మార్గాన్ని ఎంచుకున్నాడు. లాజికల్ థింకింగ్ తో ఎన్నో సమీకరణలను ఆవిష్కరించాడు.
5. క్వీన్స్ కాలేజీలో లెక్చర్ ఇవ్వడం కోసం ఐర్లెండ్ లోని కార్క్ కు బయలుదేరి మైళ్లకొద్దీ జడివానలో తడుసుకుంటూనేవెళ్లి, బట్టలు ఆరకుండానే లెక్చర్ ఇచ్చాడు. ఆ తర్వాత జలుబు, జ్వరంతో అనారోగ్యానికి గురై – 1864 డిసెంబర్ 8న కన్నుమూశారు.
6. ఆయన తన స్వీయ ఆలోచనలతో (బూలెయిన్ ఆల్జీబ్రా) రాసిన `ద లాస్ ఆఫ్ థాట్’ అనే పుస్తకం బాగా పాపులర్ అయింది.
7. నేటి కంప్యూటర్ ఇంజనీర్లకు సైతం బూలె లాజికల్ ఆలోచనలు ఉపయోగపడుతున్నాయి. బూలియన్ ఆల్జీబ్రాగా పిలిచే సిద్ధాంతాలు ఆధునిక కాలంలోనూ ఉపయుక్తంగా ఉండబట్టే గూగుల్ ఇవ్వాళ ఆయనకు గణనీరాజనం పల్కింది. అంతటి మహాదార్శనికుడు. కంప్యూటర్ల గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి బూలెయన్ లాజిక్ తెలుసుకుతీరాలి. నేటి కంప్యూటర్ సైన్స్ కు బీజం వేసింది ఆయనే.
8. ఆయన పనిచేసిన క్వీన్స్ కాలేజీ ఇప్పుడు యుసిసి (యూనివర్శిటీ కాలేజ్- కార్క్)గా పిలవబడుతోంది. ఈ కాలేజీలో తొలి గణిత అధ్యాపకుడు బూలెనే. తుదిశ్వాస తీసుకునేవరకు ఆయన ఇదే కాలేజీలో 15ఏళ్లపాటు పనిచేశారు.
9. బూలె ద్విశత జయంతి సందర్బంగా యుసిసి ప్రత్యేక వెబ్ సైట్ తయారుచేసింది. ఈ వెబ్ సైట్ ని ఆయనకు అంకితమిచ్చింది.
10. ఆయన మరణానంతరం చంద్రునిపై ఉన్న వాయువ్య బిలానికి `బూలె క్రాటెర్’ అని పేరుపెట్టారు.
– కణ్వస