తెలుగు360 రేటింగ్ : 2.5 / 5
అటెన్షన్…
ఏ సినిమాకైనా అటెన్షన్ చాలా అవసరం.
మా సినిమాలో ఏముందో తెలుసా..? అంటూ ప్రేక్షకుడ్ని ఊరించడం ఇంకా అవసరం.
ఆ అటెన్షన్ ‘జార్జి రెడ్డి’ అనే టైటిల్‌తోనే సాధించేశాడు జీవన్ రెడ్డి.
జార్జ్‌రెడ్డి అనే పేరుతో ఓ సినిమా తీస్తున్నారన్న విషయం తెలియగానే అసలు ఆ జార్జ్ రెడ్డి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ కలిగింది. ఇప్పటికే జార్జ్ రెడ్డి గురించి అవగాహన ఉన్నవాళ్లు… అతని కథని ఎలా తీశారో చూద్దామని, తెలియనివాళ్లు అసలు ఆ కథేమిటో తెలుసుకుందామని కుతూహలం చూపించారు. జార్జ్‌రెడ్డి గురించి ఈమధ్య సోషల్ మీడియాలో పెరిగిన ఫోకస్ చూస్తే.. ఈ పేరు ఎంత త్వరగా జనంలోకి వెళ్లిపోయిందో అర్థం అవుతుంది.
అదే… అటెన్షన్ అంటే.
అయితే.. సినిమాకి అటెన్షన్ ఎంత అవసరమో.. ఎమోషన్ కూడా అంతే అవసరం. కథలోని ప్రధాన పాత్రతో ప్రయాణం చేసే ఎమోషన్ ప్రేక్షకులలో కల్పించాలి. అది లేకపోతే… ఎంత గొప్ప కథైనా, ఎంత ఉన్నతమైన జీవిత చరిత్ర అయినా వృథానే. మరి.. ‘జార్జ్ రెడ్డి’లో ఆ ఎమోషన్ కనిపించిందా? ‘జార్జ్ రెడ్డి’ కథలో ఉన్న ఫైర్.. సినిమాలోనూ ఉందా…?
జార్జ్ రెడ్డి ఓ విద్యార్థి నాయకుడు. చిన్నప్పటి నుంచీ భగత్ సింగ్ స్ఫూర్తితో ఎదిగాడు. అమ్మ సహకారం, ప్రోత్సాహంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నాడు. ఉస్మానియా క్యాంపస్‌లో అడుగుపెట్టి, అక్కడి అన్యాయాలకు, ధనిక – బీద తారతమ్యాలకు ఎదురు తిరిగాడు. విద్యార్థులలో చైతన్యం నింపాడు. రైతుల కోసం పోరాడాడు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే శత్రువులు ఎలాగూ పెరుగుతారు కదా? అలా జార్జ్ రెడ్డికీ శత్రువులు తయారయ్యారు. వాళ్ల చేతుల్లో… పాతికేళ్ల ప్రాయంలోనే తన ప్రాణాలు కోల్పోయాడు. ఇది చరిత్ర. ఆ చరిత్రే ఇప్పుడు తెరపైకీ తీసుకొచ్చారు. కొన్ని కల్పిత పాత్రలూ.. కల్పిత సన్నివేశాలతో.
జీనా హైతో మర్నా సీఖో…
కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో… అంటూ పోరాటం నేర్పిన వీరుడు జార్జ్‌రెడ్డి.
అతని కథలోనే బోలెడంత హీరోయిజం ఉంది. అతన్ని చూస్తుంటే, అతని గురించి చదువుతుంటే ఓ భగత్ సింగ్, ఓ చెగోవెరా గుర్తొస్తారు. ఇప్పటికీ ఉస్మానియా గోడలు, అక్కడి చెట్లూ.. జార్జ్ రెడ్డి గురించి కథలు కథలుగా చెబుతుంటాయి. అక్కడి విద్యార్థులు పిడికిలి బిగించాల్సివచ్చినప్పుడల్లా జార్జ్‌రెడ్డిని గుర్తు చేసుకుంటారు. ఇలాంటి కథని చెప్పాలనుకోవడంలోనే సక్సెస్ ఉంది. ఆ పేరుని పోస్టర్‌పై తీసుకొచ్చినప్పుడే కిక్ వచ్చేసింది. జార్జ్‌రెడ్డి వ్యక్తిత్వం, తన పోరాటం ఈ సినిమాపై ఫోకస్ పడేలా చేశాయి.
దర్శకుడు జీవన్ రెడ్డి కూడా జార్జ్‌రెడ్డి కథని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయిపోవాలని చూశాడు. ఆ విషయంలో అస్సలు తప్పుపట్టలేం. వీలైనంత వరకూ ఎక్కడా పక్క చూపులు చూడకుండా, అనవసరమైన ట్రాకుల్లో పడకుండా జార్జ్రెడ్డిపైనే ఫోకస్ పెట్టాడు.
అయితే ఇలాంటి కథల్లో ఓ చిక్కు ఉంది. కొన్ని కథలు చదువుతున్నప్పుడో వింటున్నప్పుడో ఉద్వేగ భరితంగా ఉంటాయి. అలాంటి కథలన్నీ సినిమాలకు పనికి రావు. సినిమా కథలకు ఓ ఎమోషన్ డ్రైవ్ అవసరం. అది లేకపోతే ఉద్వేగభరితమైన చరిత్రలు కూడా నిస్సారంగా తయారవుతాయి. జార్జ్‌రెడ్డి ఆరంభం చూస్తే.. ఆ పాత్రలో ఉన్న శక్తి తెరపైకి తర్జుమా అవుతున్నట్టే కనిపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాక.. మెల్లమెల్లగా – ఆ ఘాడత తగ్గుతూ వస్తుంది. ఎక్కువ పాత్రలు, అనవసరమైన సన్నివేశాలు… కథని కాస్త గందరగోళంలో పడేస్తాయి. ఎవరు ఏ గ్రూపో అర్థం కాదు. విద్యార్థుల గొడవలు, అక్కడి రాజకీయాలు మొదట్లో బాగానే ఉన్నా – మాటిమాటికీ, ఫ్రేము ఫ్రేముకీ అవే చూపిస్తూ ఉండడంతో విసుగు మొదలవుతుంది. జార్జ్‌రెడ్డిలో స్వతహాగా ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి దర్శకుడు సీన్లు రాసుకున్నా… వాటిని ప్రభావవంతంగా తెరకెక్కించలేకపోయాడేమో అనిపిస్తుంది. విశ్రాంతి ముందు జార్జ్ రెడ్డి ఇచ్చే స్పీచులోనూ దమ్ము లేదు. ఈ కథ ఎక్కడ మొదలైందో విశ్రాంతికి కూడా అక్కడే ఉందన్న ఫీలింగ్ వస్తుంది.
ముస్కాన్ అనే అమ్మాయి జార్జ్ రెడ్డిపై డాక్యుమెంటరీ తీయాలనుకుంటుంది. ఆ క్రమంలో జార్జ్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. నిజానికి ఈ తరహా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అవసరమే లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో (ఉదాహరణకు మహానటి) ఈ తరహా స్క్రీన్ ప్లే చూసేశాం. `ఇప్పుడు జార్జ్ రెడ్డి కథ తెలుసుకుని ఏం చేస్తావమ్మా` అని అడిగితే… `చరిత్రని మారుస్తాను` అంటుంది. అయితే.. చరిత్రని మార్చేసేంత రీసెర్చ్ తను ఏం చేసిందో అర్థం కాదు. సన్నివేశాల అల్లికలోనే ఏదో లోపం కనిపిస్తుంది. అనవసరమైన పాత్రలు, వాళ్ల చుట్టూ నడిపించే సన్నివేశాలతో జార్జ్‌రెడ్డి ప్రభావం తగ్గుతూ వస్తుంటుంది. `లలన్ సింగ్ హై మేరా నామ్` అని గుండెలు బాదుకోవడం తప్ప విలన్ చేసిందేం ఉండదు. సత్యదేవ్ పాత్రలో ఉన్న లాజిక్ ఏమిటో తెలీదు. కొన్ని పాత్రల్నీ, కొన్ని లాకుల్నీ అలానే ఉంచేశాడు దర్శకుడు. బహుశా.. వాటికి సంబంధించిన క్లూ.. తన పరిశోధనలో తెలిసి ఉండకపోవొచ్చు. జార్జ్‌రెడ్డిని చంపే సన్నివేశాల్లో అయినా ఎమోషన్ పండితే బాగుండేది. ఒకొక్క కత్తి పోటు పొడుస్తుంటే… `అరె.. జాతి ఓ గొప్ప నాయకుడ్ని కోల్పోతోందే` అనే బాధ ప్రేక్షకుడిలో కలగాలి. అంతే తప్ప… `ఈ సీన్ అయిపోతే.. లేచి వెళ్లిపోవచ్చు` అన్న ఫీలింగ్ రాకూడదు. దురదృష్టవశాత్తూ… అదే జరిగింది.
జార్జ్‌రెడ్డి చాలా శక్తిమంతమైన పాత్ర. శాండీ బాగానే చేసినా – జార్జ్‌రెడ్డి అంతటి శక్తి అతనిలో కనిపించలేదు. శాండీ వాయిస్ చాలా బలహీనంగా ఉంది. ముస్కాన్ చూడ్డానికి అందంగా కనిపించింది. అయితే.. తన ప్రతిభని బయటపెట్టే అవకాశం మాత్రం రాలేదు. సత్యదేవ్ లాంటి నటుడికి సరైన పాత్ర ఇవ్వలేదు. ఆ పాత్రని అర్థాంతరంగా ముగించేశారు. మనోజ్ నందం, చైతన్య కృష్ణ, అభయ్… వీళ్లంతా సిన్సియర్‌గా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. ఫొటోగ్రఫీ, ఆర్ట్ చక్కటి పనితనం చూపించాయి. జీవన్ రెడ్డి టేకింగ్ పరంగా ఎక్కడా తప్పు చేయలేదు. మేకింగ్‌కీ బాగానే ఖర్చు పెట్టించారు. కానీ జార్జ్ రెడ్డి జీవితంలో ఉన్న ఎమోషన్‌కి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మాత్రం తీయలేకపోయాడు.
ఫినిషింగ్ టచ్: బేజార్ రెడ్డి
తెలుగు360 రేటింగ్ : 2.5 / 5