కరోనా వైరస్ కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. అసలు తగ్గే పొజిషన్లో కూడా లేదు. ఏ స్థాయిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. కానీ అప్పుడే… సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపించడం ప్రారంభించింది. ఆయా దేశాలను పరిపాలిస్తున్న పాలకులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొంత మంది గుండె ధైర్యంతో ఉంటే.. మరికొంత మంది … జావకారిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. జర్మనీలోని ఓ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు.
జర్మనీలోని హెస్సీ అనే రాష్ట్రానికి ధామస్ షిఫర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కరోనా వైరస్ జర్మనీపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూండటంతో.. అక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో.. ఆర్థిక మంత్రిగా ఉన్న థామస్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరిస్థితుల్ని మెరుగుపర్చాలో తెలియక సతమతమవుతున్నారు. కరోనాను ఎదుర్కొని.. జీవితాల్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తారని …చితికిపోయిన తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు కనిపించే మార్గం ధామస్కు కనిపించలేదు.
జర్మనీలోని హెస్సీ రాష్ట్రం ఆర్థికంగా ఆ దేశంలోనే కీలకమైన రాష్ట్రంగా ఉంది. ఫ్రాంక్ ఫర్ట్ ..ఈ రాష్ట్రంలోని నగరమే. ప్రఖ్యాత వ్యాపార సంస్థల హెడ్ క్వార్టర్లు ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్నాయి. ఆర్థిక సేవల రాజధానిగా ఫ్రాంక్ ఫర్ట్కు పేరు ఉంది. ప్రపంచంలో ప్రముఖ బ్యాంక్‌గా పేరున్న డూషే బ్యాంక్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. హెస్సీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ధామస్ పదేళ్లుగా వ్యవహరిస్తున్నారు. సమర్థునిగా పేరుత తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం.. ఆయనకు అర్థం కాలేదు.