కాపుల రిజర్వేషన్ల అంశం పేరెత్తగానే తెలుగుదేశం నేతలకు కలవరం పుట్టేది. ముద్రగడ పద్మనాభం ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారూ అనగానే.. ప్రభుత్వం తరఫు నుంచి చర్యలు మొదలైపోయేవి. అధికార పార్టీలోని కాపు నేతలు హుటాహుటిన తెరమీదికి వచ్చేసేవారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు ఇలాంటి నేతలంతా మీడియా ముందు హడావుడి. రిజర్వేషన్ల అంశంపై ఇంత టెన్షన్ ఉండేది! ఆ టాపిక్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటానికి ఆలోచించేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపుల రిజర్వేషన్లను తమకు అత్యంత అనుకూలంశంగా మార్చుకునే క్రమంలో సీఎం ఉన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చారు. రోడ్ షోలో కాపుల రిజర్వేషన్లపై మరోసారి మాట్లాడారు. కాపుల కోసం ఆలోచిస్తున్నది తమ సర్కారు మాత్రమేననీ, రిజర్వేషన్లు ఇచ్చేది కూడా తాము తప్ప వేరేవారు కాదని తీవ్రస్వరంతో చెప్పారు.
2004లో రిజర్వేషన్ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదనీ, ఆ తరువాత 2009 ఎన్నికల్లో రిజర్వేషన్లను మేనిఫెస్టోలో కాంగ్రెస్ వారు పెట్టారుగానీ.. ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. వైయస్ హయాంలో ఇతర కులాలకు రిజర్వేషన్లు వచ్చాయి కానీ, కాపూ బలిజా ఒంటరీ లాంటి ఇతర కులాలకు మొండి చేయి చూపించారన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న రోజుల్లోనే కాపుల సమస్యలను తెలుసుకున్నాననీ, వారికి రిజర్వేషన్లు అవసరమని గుర్తించాననీ, అదే విషయాన్ని అప్పట్లో ప్రకటించానని చంద్రబాబు గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో కూడా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని తాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామనీ, ఇతర పార్టీలేవీ దీని గురించి పట్టించుకోలేదన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు వస్తుందనీ, ఇతర బీసీ కులాలకు ఎలాంటి ఇబ్బంది రానీయకుండా, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
ఇటీవల విజయవాడలో కాపు సంఘాల నేతలతో సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ ఈ అంశంపై చంద్రబాబు చాలా జాగ్రత్తపడ్డారనే చెప్పొచ్చు! వచ్చే ఎన్నికల్లో కీలకాంశం ఇదే అవుతుందని అనుకుంటే… ఇతర పార్టీలకు విమర్శించే అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి, విజయవాడలో చెప్పిన విషయాలనే కాకినాడలో కూడా చెప్పారు. అవకాశం దొరికితే మరోసారి మరో వేదికపై కూడా ఇదే చెప్తారు! ఎందుకంటే… ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారుతున్న ముద్రగడ పద్మనాభం ప్రభావాన్ని తగ్గించడంతోపాటు, రిజర్వేషన్ల హామీపై ప్రతిపక్షానికి ఏమాత్రం మైలేజ్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో సీఎం ఉన్నారని అర్థమౌతోంది. మొత్తానికి, ఇన్నాళ్లూ టెన్షన్ పెట్టిన రిజర్వేన్ల అంశాన్ని ఇలా తమకు అనుకూలంగా మార్చేస్తున్నారు సీఎం చంద్రబాబు! అయితే, మాటలు మాత్రమే సరిపోవు కదా! గత ఎన్నికల్లో వైకాపా దీని గురించి మాట్లాడకపోయి ఉండొచ్చు, అంతకుముందు వైయస్ పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏదో ఒకటి చేయాలి. మంజునాథ కమిషన్ నివేదిక పేరుతో నాచ్చుతూ పోతే.. మరోసారి ప్రతిపక్షాలకు పగ్గాలు అందించినట్టే అవుతుంది.