‘జబర్దస్త్’ బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జనసేనానికీ, కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. జబర్దస్త్ బ్యాచ్ ఇలా స్వచ్ఛందంగా ప్రచారానికి దిగడం.. వైకాపా వర్గానికి నచ్చడం లేదు. దాంతో వాళ్లపై రకరకాల రూపాల్లో విషపు ప్రచారం చేస్తున్నారు. రోజా సైతం ‘పిల్ల బ్యాచ్’ అంటూ జబర్దస్త్ టీమ్ ని తేలిగ్గా తీసిపారేసింది. రోజువారీ కాల్షీట్ల లెక్కన జబర్దస్త్ టీమ్‌కు లక్షల్లో పారితోషికాలు ముడుతున్నాయని, వాళ్లపై రూ.2 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారని వైపాకా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని గెటప్ శ్రీను తిప్పి కొట్టారు.
”మేమంతా స్వచ్ఛందంగానే ప్రచారం చేస్తున్నాం. ఫోన్లు చేసి మరీ బతిమాలుకొని పిఠాపురం వెళ్లాం. ఇంటింటికీ తిరిగాం. మా ఎకౌంట్ నెంబర్లు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎవరెంత డబ్బులు తీసుకొన్నారో, అసలు డబ్బులు పడ్డాయో లేదో మీకే తెలుస్తుంది” అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పవన్ అంటే ఇష్టమని, నిజాయతీ పరుడని, తను గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రచారం చేస్తున్నామని, ఇందులో ఎలాంటి దురుద్దేశ్యాలూ లేవని తేల్చి చెప్పారు. మెగా కుటుంబానికి సపోర్ట్ చేయకపోతే, సినిమా అవకాశాలు రావన్న కామెంట్ ని కూడా గెటప్ శ్రీను తిప్పి కొట్టారు. ”నేను వెంకటేష్ గారితో చేశా. ఎన్టీఆర్ గారితో చేశా. మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు, అందరూ నాకు అవకాశాలు ఇచ్చారు” అని స్పష్టం చేశారు గెటప్ శ్రీను. ఈసారి పవన్‌కు లక్ష మెజారిటీ ఖాయమని జోస్యం చెప్పారు. గెటప్ శ్రీను కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘రాజూ యాదవ్’ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.