టీజర్ చూసి సినిమా భవిష్యత్తేంటో లెక్కగట్టేస్తున్నారు జనాలు. టీజర్ అద్భుతంగా ఉండి… సినిమాలోవిషయం లేకపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే సినిమా ఎలా ఉన్నా – టీజర్లో మెరుపులు కనిపించడం ఓ రూలుగా పెట్టుకున్నారన్నమాట సినీ జనాలు. అలాంటప్పుడు టీజరే ‘డల్’గా.. ముక్కలు ముక్కలుగా తయారైతే ఎలా ఉంటుంది..? `ఘంటసాల` టీజర్‌కి అదే జరిగింది.
ఈ దేశం ఇచ్చిన అద్భుతమైన గాయకులలో ఘంటసాల ఒకరు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి గాయకుడి జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే ఓ ఉత్సుకత ఏర్పడుతుంది. దాన్ని… ఎంత కాపాడుకుంటే.. అంత విలువ. ‘ఘంటసాల’ టీజర్ చూస్తే మాత్రం ఆయన్ని క్యాష్ చేసుకొనే ప్రయత్నంలా మాత్రమే కనిపిస్తుంది. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా కనిపించబోతున్నాడు. ఘంటసాల రూపానికీ, ఆయనకీ ఉన్న పోలికలు పక్కన పెట్టేద్దాం. టీజర్ కట్ చేసిన తీరు, అందులో చూపించిన విజువల్స్ చూస్తే… ‘ఇదిచుట్టుడు బేరమే’ అనిపించక మానదు. అవడానికి 2.45 నిమిషాట టీజరే. అందులో సగానికి పైగా ఇప్పటి వరకూ వచ్చిన బయోపిక్స్ల ప్రస్తావనతోనే సరిపోయింది. ‘ఘంటసాల’ టీజర్లో షాట్లు చూస్తే.. కొన్ని కట్ పేస్టులు కనిపిస్తాయి. టీజర్ కోసమే కొన్ని షాట్లు తీశారన్న అనుమానమూ వేస్తుంది. షార్ట్ ఫిల్మ్స్‌లో చూపించే నామ మాత్రపు నాణ్యత కూడా ఈ టీజర్లో లేదు. సినిమా అంతా ఇలానే ఉంటుందా?? అనే అనుమానాలు వేస్తున్నాయి ఇప్పుడు. ఏదేమైనా.. మహనీయుల జీవిత కథల్ని తెరకెక్కిస్తున్నప్పుడు నిర్మాతలు కాస్త జాగ్రత్త పాటించాలి. ఇలా కనీస ప్రమాణాలు కూడా పాటించకపోతే – కచ్చితంగా బయోపిక్‌ల పేరుతో గొప్ప వాళ్లని అవమానించడమే అవుతుంది.