హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడో, రేపో గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలి కాలంలో ఆయన పెద్దగా… వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కనిపించడం లేదని ఎవరూ పట్టించుకోలేదు కూడా. తన అసెంబ్లీ టిక్కెట్‌పై జగన్ ఎటూ తేల్చకపోవడం.. అసలు టిక్కెట్ ఇస్తారో లేదో అన్నట్లుగా పరిస్థితి మారడంతో.. ఆయన అసంతృప్తికి గురయ్యారు. అందుకే.. పార్టీ మారబోతున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గత ఎన్నికలకు ముందు… తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. గల్లా అరుణకుమారి కుటుంబంతో బంధుత్వం కారణంగా.. వారితో కలిసి టీడీపీలో చేరాలనుకున్నారు. ఆ సమయంలో… గల్లా జయదేవ్ కు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు కానీ… ఆదిశేషగిరిరావుకు చాన్స్ దక్కలేదు. దాంతో ఆయన వైసీపీలో చేరిపోయారు.
అప్పట్లో వైసీపీలో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి.. ఆయన కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా..ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త చురుగ్గానే పని చేశారు. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజవర్గం కేంద్రంగా పని చేసుకున్నారు. తెనాలి అసెంబ్లీ అయినా.. గుంటూరు పార్లమెంట్ సీటు అయినా ఏదో ఒకటి జగన్ ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. ఈ కారణంగానే.. మహేష్ బాబు అభిమానులంతా.. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారంటూ.. ఆయన తరపున పలుమార్లు ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇది వివాదాస్పదం కూడా అయింది. అయినా ఆదిశేషగిరిరావు మాత్రం… మహేష్ బాబు, కృష్ణ అభిమానులందరూ… వైసీపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు ముంగిటకొచ్చేశాయి. జగన్ టిక్కెట్లు కసరత్తు చేస్తున్నారు కానీ.. ఆదిశేషగిరిరావు పేరు మాత్రం ఏ నియోజకవర్గానికి పరిశీలించడం లేదు. జగన్ తనను కరివేపాకులా తీసేశాడని.. గుర్తించిన ఆదిశేషగిరిరావు.. చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. జగన్ పిలిచి బుజ్జగించి టిక్కెట్ ఇస్తే సరే .. లేకపోతే.. ఆయన బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.