కేతిగాడు అంటే బహుశా ఇప్పటి తరం ఆడియన్స్ కి పెద్ద గా తెలీదేమో. తోలుబొమ్మలాట లో ఇది ఒక హాస్య పాత్ర. సినిమా భాష లో చెప్పాలంటే, కథ మధ్యలో రిలీఫ్ ఇచ్చే కమెడియన్ పాత్ర. పోలిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్క – ఈ మూడు పాత్రల మధ్య కథ రసపట్టు లో ఉన్నపుడు, కేతిగాడు పాత్ర ప్రవేశించి, కాసేపు వినోదాన్ని పంచి వెళ్ళిపోతుంది. తోలుబొమ్మలాట లో ఈ పాత్ర కి ప్రాధాన్యమున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాత్రకి విశేషాదరణ ఉన్నప్పటికీ, రాజకీయ విమర్శలకి వచ్చేసరికి “అతను ఒక బఫూన్” అనే తిట్టుకి సరిసమానమైన తిట్టు గా మన రాజకీయ నాయకులు ఈ కేతిగాడు అనే పదాన్ని వాడుతుంటారు. ఇప్పుడు ఈ పదాన్ని పవన్ కళ్యాణ్ కి ఆపాదిస్తూ విమర్శలు చేసారు – ఆదిశేషగిరిరావు. ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు కి బాబాయి, కృష్ణ గారి సోదరుడు. అయితే రాజకీయంగా వైసిపి లో కొనసాగుతున్నాడు.
ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ఒక కామెడీ ఎపిసోడ్ అనీ, పవన్ ఒక కేతిగాడనీ, మధ్య మధ్యలో వచ్చి పోతుంటాడనీ, ఈయన బయటికి రావాలంటే చంద్రబాబు బటన్ నొక్కాలనీ, సమస్య మొత్తం అయిపోయాక అప్పుడు వచ్చి పవన్ స్పందిస్తూంటాడనీ, సకాలం లో పవన్ ఎప్పుడూ స్పందించడనీ ఈయన అన్నారు. వైసిపి వచ్చే ఎన్నికల్లో 125 స్థానాలు సాధించడం ఖాయం అని, 2019 లో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అని అన్నారు. ఇక మహేష్ బాబు రాజకీయాలకి దూరంగా ఉంటాడని మరొక సారి క్లారిటీ ఇచ్చాడు.