హైదరాబాద్: తెలుగు రాజకీయాలలో ట్విట్టర్లో ఎక్కువగా, జనంలో తక్కువగా కనిపించే నాయకులలో ఒకరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు గానూ ట్విట్టర్లోనే ప్రచార శంఖారావాన్ని పూరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సెటిలర్ల ఓట్లు కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం వారిపట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. సెటిలర్ల ఓట్ల విషయంలో టీఆర్ఎస్ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. గతంలో సెటిలర్ల ఓట్ల విషయంలో రాద్ధాంతం చేసిన టీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకునేందుకు సానుభూతి ప్రదర్శిస్తోందని ట్వీట్ చేశారు. దీనికి హైదరాబాద్ బర్బాద్ అన్న హ్యాష్ ట్యాగ్ జోడించారు. సెటైర్లు బాగానే ఉన్నాయిగానీ, వీటివలన పెద్ద ప్రయోజనం ఉండదు చినబాబూ! ఫీల్డ్‌లోకి దిగు! కేటీఆర్‌ను చూసైనా నేర్చుకో!