ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చేశాయనే సంబరం ఆవిరి కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. పార్టీల టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడ్డ తీరుకు అంతా విస్తుపోయారు. ఒక్కో డివిజన్ లో ఒకే పార్టీ నుంచి 10 మందికి పైగా పోటీ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. ఒక్కరికి టికెట్ ఇస్తే మిగతా 9 మంది జంప్ అవుతారేమో అనే భయం. అందుకే, అధికార తెరాసతో సహా అన్ని ప్రధాన పార్టీల్లోనూ రెబెల్స్ భయం తొలగిపోలేదు. అందుకే, దాదాపుగా ప్రధాన పార్టీలేవీ అభ్యర్థులకు బీఫారాలను ఇవ్వలేదు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారమే బీఫారాలను ఇవ్వాలని పార్టీల నాయకులు నిర్ణయించారు,
ఈసారి తిరుగుబాటు అభ్యర్థుల బెడద పార్టీలకు తలనొప్పిగా మారింది. వారిని బుజ్జగించడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పదవుల ఆశ లేదా డబ్బు ఆశ చూపుతున్నట్టు తెలుస్తోంది. బాలానగర్ డివిజన్లో టీడీపీ పేరుమీద 10మంది, తెరాస పేరుమీద ఏడుగురు, కాంగ్రెస్ పేరుమీద ఐదుగురు నామినేషన్లు వేశారు.
కూకట్ పల్లిలో బీజేపీ నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, తెరాస నుంచి నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. సూరారం డివిజన్లో తెరాస నుంచి 10 మంది, టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి నలుగురు నామినేషన్ వేశారు. బీజేపీకి కేటాయించారని ప్రచారం జరిగిన జూబ్లీహిఃల్స్ లో తెరాస నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి నలగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా, ఇంత మందిలో ఎవరికి టికెట్ ఇస్తే ఏమవుతుందో అనే టెన్షన్. టికెట్ రాని వారు వేరే పార్టీలోకి ఫిరాయిస్తారేమో, లేదా రెబెల్స్ గా బరిలో ఉంటారేమో అనే అనుమానం. అంతేకాదు, టీడీపీ, బీజేపీలకు మరో సమస్య ఉంది. ఒకరికి కేటాయించిన సీటులో మరొక పార్టీనుంచి ఒక్కరు కాదు ఇంకా ఎక్కువ మందే నామినేషన్లు వేసిన సందర్భాలున్నాయి.
తిరుగుబాటు అభ్యర్థులను ఒప్పించి, కనీసం చివరి రోజైన గురువారం నాడైనా ఉపసంహరించేలా చూడటానికి గత నాలుగు రోజులుగా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. అధికార తెరాసలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అయితే, భవిష్యత్తులో పదవులు ఇస్తాం కాబట్టి మాట వినండని నాయకత్వం చెప్తే వింటారని అనుకున్నారు. కానీ ఆ పార్టీలోనూ రెబెల్స్ బెడద ఎక్కువగానే ఉంది. చివరకు బీజేపీలోనూ చాలా చోట్ల అభ్యర్థులు నాయకుల మాట వినకుండా పోటీలో ఉంటామంటున్నారు. అందుకే, గురువారం నాడు రెబెల్స్ ఉపసంహరించుకుంటారనే పార్టీ అధినాయకుల ఆశలు నెరవేరుతాయా లేక తిరుగుబాటు బెడద అనివార్యం అవుతుందా అనేది తేలిపోబోతోంది. అప్పటి వరకూ పార్టీలకు టెన్షన్… టెన్షన్.