ఎన్నికలంటే కేవలం ఓట్లు మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి. సభలు నిర్వహించడం, కార్యకర్తల్ని పెద్ద సంఖ్యలో పోషించాల్సి రావడం, అందుకు అవసరమైన నిధులు, వనరులు సమీకరించడం, ఇవన్నీ కూడా అనూహ్యమైన భారీస్థాయిలోనే ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కే అయినప్పటికీ.. ఇవి.. ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే రీతిలో ఖర్చులో తలదన్నుతున్నాయనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ వనరులు అన్నీ పార్టీలకు ఎక్కడినుంచి సమకూరేటట్లు? నిజానికి ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.
తాజా పరిణామాలను గమనిస్తే.. ఇలాంటి ‘బాధ్యతలను పంచుకోవడానికి’ ఆంధ్రా ప్రాంతానికి చెందిన మిత్రులు, పెట్టుబడిదారులు, వ్యాపారాలు (మీరు వారిని ఏ పేరుతోనైనా పిలవండి) అలాంటి వారినుంచి తెరాస తరఫున నగర ఎన్నికల బాధ్యత చూస్తున్న కేటీఆర్‌కు భారీగానే ఆఫర్లు వెల్లువెత్తుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని మిగిలిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు కూడా సూచన ప్రాయంగా తెలియజేయాలనుకున్నారో ఏమో గానీ.. కేటీఆర్ తానే స్వయంగా వెల్లడించారు.
కేటీఆర్ విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. అందుకు ఆయనకు ఆంధ్రాప్రాంతపు మిత్రులు చాలా మందే ఉన్నారు. ఆ విషయాన్ని కలిపేసి.. ఆయన చాలా లౌక్యంగా.. ఈ వనరులు, నిధుల సంగతిని కూడా ఇండైరక్టుగా తెలియజెప్పారు. జూబ్లీహిల్స్‌లో ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఏం అన్నారంటే..
”నాకు ఆంధ్రా ప్రాంతంలో చాలా మంది మిత్రులున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేస్తున్నప్పుడు.. నా మిత్రులు వ్యక్తిగతంగా ఓటు మాత్రం వేస్తాం అని చెప్పారు. కానీ తెరాస పార్టీకి ఓటు వేయబోం అని నిర్మొహమాటంగా చెప్పారు. కానీ ఆ మిత్రులే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలని అడుగుతున్నారు” అంటూ కేటీఆర్ మర్మం చెప్పారు. ఈ ప్రేమంతా 18 నెలల కేసీఆర్ పాలన వల్లనే వచ్చిందని ఆయన అంటున్నారు గానీ… నిజానికి కేటీఆర్ ఇప్పుడు రూలింగ్ పార్టీ మనిషిగనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన మిత్రులైన ఆంధ్రా పెట్టుబడిదారులంతా ఎగబడుతున్నట్లు జనం అర్థం చేసుకుంటున్నారు.
‘సమావేశాలు నిర్వహించడం’ అంటే ఖర్చులు భరించడమే అని, ‘ఇంకా ఏం చేయాలో’ అంటే నిధుల సమీకరణ అని జనం భాష్యం చెప్పుకుంటున్నారు. ఈ ప్రేమ అంతా అధికార పార్టీ నుంచి లబ్ధి పొందడానికే అని కూడా జనం భావిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి సీక్రెట్లు అన్నీ కేటీఆర్ బయటపెట్టేయడం తెలిసిచేస్తున్నారో? తెలియక చేస్తున్నారో??