గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మెరుపు వేగంతో పూర్తి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసార్ధి షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. పద్దెనిమిదో తేదీ నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇరవయ్యే తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే.. నామినేషన్ల దాఖలుకు మూడంటే మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఇరవై ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన .., ఇరవై రెండో తేదీన ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారు. ప్రచారానికి వారం అంటే.. వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట డిసెంబర్ మూడో తేదీన రీపోలింగ్ ఉంటుంది. నాలుగో తేదీన కౌంటర్ జరుగుతుంది.
ఈ ఎన్నికల్లో పూర్తిగా బ్యాలెట్లనే వాడుతున్నారు. కరోనా బారిన పడిన వారికి.. వృద్ధులకు ఈ ఓటింగ్ చాన్సిస్తారన్న ప్రచారం జరిగింది.కానీ అలాంటిదేమీ లేదని… ఎస్ఈసీ పార్థసారధి ప్రకటించారు. గతంలో చేసిన జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగానే షెడ్యూల్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఓటర్ల జాబితానే గ్రేటర్ ఎన్నికలకు ఉపయోగిస్తున్నట్లుగా పార్థసారధి తెలిపారు. 150 డివిజన్లకు.. 150 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయం మారిపోయిందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ ప్రభావం లేదని చెప్పడానికి గ్రేటర్ ఎన్నికలనే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.ఈ కారణంగా.. హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. కోర్టుల్లో స్టే కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించి బాధ్యతలను అప్పగించాయి.
గ్రేటర్ వార్ షెడ్యూల్ ఇలా
18 నుంచి 20 వరకు నామినేషన్లు
21న నామినేషన్ల పరిశీలన
22న ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
23న నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ప్రచారానికి వారం రోజులు గడవు
డిసెంబర్ 1న పోలింగ్
డిసెంబర్ 3న రీపోలింగ్ ( అవసరం ఉంటే )
డిసెంబర్ 4న కౌంటింగ్