గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నంలోగా అన్ని ఫలితాలు వచ్చేస్తాయని తొలుత అందరూ అనుకున్నారు. మేయర్ పీఠం ఎవరి వశం అవుతుందో.. సమస్తం క్లారిటీ వచ్చేస్తుందని భావించారు. అయితే మజ్లిస్ అరాచక దాడులు, మారిన పరిణామాల నేపథ్యంలో సాయంత్రం అయితే తప్ప.. ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు. మజ్లిస్ దాడుల పుణ్యమాని పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ పరిధిలో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీపోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అది అయిన తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు.
నిజానికి పాతబస్తీ అల్లర్లు పోలింగ్నాడేచోటు చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం సత్వరం స్పందించి.. అదే రోజున లేదా బుధవారం నిర్ణయం తీసుకుని ఉంటే గురువారమే రీపోలింగ్ సాధ్యం అయ్యేది. అయితే ఎన్నికల సంఘం ఈ విషయంలో మీనమేషాలు లెక్కించింది. జరిగిన అల్లర్లు ఎంత బాహాటంగా జరిగినప్పటికీ.. వారు నిర్ణయం తీసుకోలేకపోయారు. చివరికి జనం అందరూ చూసిన గొడవల తర్వాత తాము స్పందించకుంటే బాగుండదనుకున్నారో ఏమో.. ఒకే డివిజన్లో శుక్రవారం రీపోలింగ్‌కు ఆదేశించారు. అయితే అదేరోజున కౌంటింగ్ ఉన్నందున ఒకవైపు కౌంటింగ్‌లో ఫలితాలు వెల్లడైపోతూ ఉంటే.. అది ఓటింగ్ సరళి మీద ప్రభావం చూపిస్తుంది కదా అనే అనుమానం పలువురికి కలిగింది.
ఆ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో మార్పులు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు పురానాపూల్ ఓటింగ్ జరగనున్నందున సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. దీనివలన 5 గంటల తర్వాత మాత్రమే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.