గ్రేటర్లో పోలింగ్ మరీ తక్కువేం కాదు.గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువే నమోదయినట్లుగా ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం.. రెండు, మూడు వరకు చాలా డివిజన్లలో పది శాతంలోపే ఓటింగ్ జరిగిందని ఈసీ వర్గాలు మీడియాకు చెప్పాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓవరాల్ పోలింగ్ పాతిక శాతం కూడా లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం నమోదైనట్లు ప్రకటించింది. అయితే.. పోలింగ్ గడువు ముగిసే సరికి మాత్రం… 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లుగా తేలింది. మామూలుగా ఇది తక్కువే కానీ… గ్రేటర్లో గత ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే మాత్రం.. ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2016లో 45.27 శాతం మాత్రమే ఓట్లేశారు. 2009లో 42.95 శాతం, 2002 ఎంసీహెచ్ ఎన్నికల్లో 41.22 శాతం పోలింగ్ నమోదయింది.
గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడు.. ఎలాంటి పోలింగ్ జరిగినా… యభై శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే భారీ పోలింగ్ జరిగినట్లే లెక్క అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎనభై శాతం మంది ఓటర్లు ఓటు వేస్తే.. హైదరాబాద్లో 51 శాతం వరకూ ఉంటుంది. సహజంగానే స్థానిక ఎన్నికలు అనే సరికి చాలా మంది ఆసక్తి చూపించరు. సాధారణంగా ఓటింగ్ అంటే … పోలింగ్ బూత్ల ముందు రోజులో కనీసం ఒక్క సారి అయినా చిన్న పాటి క్యూలు కనిపిస్తాయి. కానీ హైదరాబాద్లో జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా క్యూలు కనిపించలేదు. ఈవీఎంలు ఉపయోగిస్తే.. చకచకా ఓట్లు వేసి వెళ్లిపోతారు. కానీ ఇప్పుడు బ్యాలెట్ వాడారు. ఓటు వేసేందుకు ఓటర్ కాస్త సమయం తీసుకుంటారు. అయినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించలేదు. కొన్ని కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది నిద్రపోతూ కనిపించారు. పోలింగ్ ముగిసే గడువు ఆరు గంటలకు ఎంత మంది క్యూలో ఉంటే… అంత మందికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. కానీ ఎలా.. ఆరు గంటల తర్వాత ఎక్కడా పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు.
బ్యాలెట్లు ఉపయోగించడంతో.. వివిధ పోలింగ్ స్టేషన్ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాకపోవడం వల్ల అతి తక్కువగా పోలింగ్ నమోదయిందని మొదటగా ప్రచారం జరిగిందని అంచనా వేస్తున్నారు. చివరికి పోలింగ్ 46 శాతానికి దగ్గరగా చేరడం.. గత పోలింగ్ శాతానికన్నా ఎక్కువ కావడంతో… హైదరాబాద్ ఓటరు మరీ బద్దకించలేదని అంచనా వేస్తున్నారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్ఫంగా రేగిన వేడికి… ఉద్రిక్తతలకు వచ్చిన ప్రాధాన్యం బట్టి చూస్తే మాత్రం పోలింగ్ పర్సంటేజీ తీసి కట్టే అవుతుంది.