గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో నాలాలపై ఆక్రమణల గురించి మాట్లాడారు. 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదని.. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు… హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని సవాల్ చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత అనే మాట అక్బర్ నోటి వెంట రాగానే బీజేపీ అలర్టయింది. సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలతో గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ఒక్క సారిగా తన వైపునకు తిప్పుకున్న బండి సంజయ్.. మరో సారి తెరపైకి వచ్చారు.
హిందువుల ఆరాధ్యుల్లాంటి వారైన పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల జోలికి వస్తే .. ఆ మరుక్షణం ..ఎంఐఎం కార్యాలయం అయిన దారుస్సలాం నేల మట్టం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీ పోవాలంటే ఓవైసీ పర్మిషన్ తీసుకోవాలని చార్మినార్ ఎమ్మెల్యే అంటున్నారని… సవాల్‌ను కేసీఆర్ స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే.. మిత్రపక్షంగా పేరు పడిన ఎంఐఎం నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం.. టీఆర్ఎస్కు కూడా ఇబ్బందికరంగా మారింది. వెంటనే.. కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని.. ట్విట్టర్లో ఖండించారు.
వారిద్దరూ సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్న నాయకులన్నారు. ఇప్పటికే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలకు కారణం అవుతోంది. అదే సమయంలో అక్బరుద్దీన్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల గురించి ప్రస్తావించడంతో బీజేపీ మరింత అడ్వాంటేజ్ తీసుకుంది. వారిద్దర్నీ హిందూత్వానికి ప్రతీకలుగా చెప్పుకుని ఓన్ చేసుకునే ప్రయ.త్నం చేస్తోంది. మరింత విస్తృతమైన మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. 1/2
— KTR (@KTRBRS) November 25, 2020