గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు… గత పదేళ్ళు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు… రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కాని ఇప్పుడు కథ మారింది. అసలు బీఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో మూడో పార్టీగా మిగిలిపోతుందా అనే అభిప్రాయం ఒకటి బలంగా వినపడుతోంది. అవును… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజం అనే భావన కలుగుతోంది. అసలు వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు ముందు పెట్టుకుని… సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాకు, మూసి సుందరీకరణకు ఎందుకు దిగారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాగా… ఈ విషయంలో బీజేపి సైలెంట్ అయి బీఆర్ఎస్ ఎందుకు పోరాటం చేస్తుందనేది బిలియన్ డాలర్ల క్వశ్చన్.
మూసికి, హైడ్రాకు బీజేపి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా వ్యతిరేకించడం లేదు. కాని బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ విషయంలో ఏకతాటిపై ఉంది. కేటిఆర్ గట్టి పోరాటమే చేస్తున్నారు. దాని వెనుక కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో విజయమే అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే ఇక్కడ బిజెపి, టీడీపీ వ్యూహంపై సైలెంట్ గా చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో పాగా వేయాలని కమలం పార్టీ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో బిజెపి, బీఆర్ఎస్ మధ్యనే పోటీ అనే వాతావరణం కేటిఆర్ వ్యూహాత్మకంగా క్రియేట్ చేసి కాంగ్రెస్ ను సైలెంట్ చేసారు. మజ్లీస్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది.
కాని ఇప్పుడు కాంగ్రెస్ – బీజేపి నేతలు బీఆర్ఎస్ ను సైలెంట్ చేసేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు పార్టీల నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బహుసా ఆ కోపంతోనే కేటిఆర్ ను టార్గెట్ చేస్తున్నారనే భావన కూడా ఉంది. ఇక బిజెపికి… టీడీపీ నుంచి మద్దతు రానుంది. ఉమ్మడిగా హైదరాబాద్ లో పోటీ చేస్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి సైకిల్ ఎక్కడానికి సిద్దం అయ్యారు హైదరాబాద్ లో. దీనితో గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాలను వీలైనంత త్వరగా అమలు చేయడానికి సిద్దమవుతోంది ఎన్డియే. తాజాగా హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన చంద్రబాబు… బిజెపి అగ్ర నేతల మధ్య ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు త్వరలోనే హైదరాబాద్ లేదా అమరావతిలో తెలంగాణా బీజేపి నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే కచ్చితంగా ఎన్డియే రెండవ స్థానం లేదంటే మేయర్ పీఠం అనే లెక్కలు వినపడుతున్నాయి.