సుమారు ఏడాదిగా ఎదురు చూస్తున్న జి.హెచ్.ఎం.సి. (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్) ఎన్నికల నిర్వహణకి ఎట్టకేలకు తెలంగాణా ప్రభుత్వం సిద్దపడుతోంది. జనవరి నెలాఖరులోగా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు తప్పకుండా నిర్వహిస్తామని తెలంగాణా ప్రభుత్వం హైకోర్టుకి మాట ఇచ్చినందున ఇక ఈసారి ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేదనే భావించవచ్చును. డిశంబర్ 25 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా నేటి నుంచి సవరించిన ఓటర్ల జాబితాలను సంబంధిత వార్డులు, జోనల్, తహసిల్దార్ కార్యాలయాలలో రాజకీయ పార్టీల మరియు ఓటర్ల పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతారు.
ఈనెల 27న ప్రభుత్వం అన్ని పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాల సవరణలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాలు, జి.హెచ్.ఎం.సి. ఎన్నికల షెడ్యూల్ తదితర అన్ని అంశాల మీద విస్తృతంగా చర్చించిస్తుంది. అనంతరం డిశంబర్ 8న వివిధ వార్డులకు ఖరారు చేసిన ఎస్సీ, బీసీల కోటాల వివరాలను ప్రకటిస్తుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 33 శాతం వార్డులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మూడు వర్గాలకు మొత్తంగా 56 శాతం రిజర్వ్ చేయగా మిగిలిన 44 శాతంలో మైనార్టీలు, మహిళలు ఇతరులకి కేటాయించతారు. డిశంబర్ 25న నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి 20-25 తేదీల మధ్య జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓటర్ల జాబితాలో తప్పులున్నట్లు ఓటర్లు గుర్తించినా లేదా కొత్తగా నమోదు చేయించుకోదలచినా నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకొంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణకు సుమారు 40 వేల మంది సిబ్బంది, 5 వేల ఈవీఎంలు ఏర్పాటు చేసుకోవలసిందిగా ప్రభుత్వం జి.హెచ్.ఎం.సి.కి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది.