తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఇంకా ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియదు కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ఓటర్ల జాబితా నుండి తొలగించే కార్యక్రమం భారీ ఎత్తున చేప్పట్టింది. జి.హెచ్.యం.సి. పరిధిలో మొత్తం 27, 12, 468 మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించేందుకు నోటీసులు జారీ చేస్తోంది. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్లోనే ఏకంగా 1,21,085 ఓట్లను తొలగించారు.
కాంగ్రెస్, తెదేపా, బీజేపీలకి మంచి పట్టున్న ప్రాంతాలయిన ఖైరతాబాద్, ఉప్పల్, అమీర్ పేట్, బాలానగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాలలో ఈ ఓటర్ల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. రెండు ప్రాంతాలలో ఓట్లు ఉన్నవారు, స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపలేనివారు, ఇళ్ళకు తాళాలు వేసున్నవారికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన గడువులోగా స్పందించనివారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ తెలిపారు. సరయిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతామని చెపుతున్నారు. జి.హెచ్.యం.సి.ఎన్నికలలో తెరాస పోటీ చేసి గెలవలేకనే జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను రద్దు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు పిర్యాదు చేసాయి.