మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డి.కె.అరుణకు సంబందించిన ఆస్తిగా చెప్పుకొంటున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోగల 400 గజాల ఖాళీ స్థలాన్ని ఆదివారం జి.హెచ్.యం.సి. అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దాని విలువ సుమారురూ.40 కోట్లు వరకు ఉంటుందని అంచనా. జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించడంతో టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి శేకర్ రెడ్డి నేత్రుత్వంలో జి.హెచ్.యం.సి. సర్కిల్-10 అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ ప్రదేశంలో ఉన్న నిర్మాణాలన్నిటినీ తొలగించి స్వాధీనం చేసుకొన్నారు. ఈ సంగతి తెలుసుకొని డి.కె. అరుణ భర్త భరతసింహా రెడ్డి అనుచరులు వచ్చి వారిని అడ్డుకొనే ప్రయత్నం చేసారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొన్నారు. జి.హెచ్.యం.సి. అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అది తమ స్థలమని తెలియజేస్తూ అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసారు.
నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంపై చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఒక సొసైటీ వాళ్ళు అది తమదని వాదిస్తున్నారు. భరతసింహా రెడ్డి కూడా ఆ స్థలం తనదని వాదిస్తూ తన అధీనంలో ఉంచుకొన్నారు. దానిపై ఆయన కోర్టుకి కూడా వెళ్ళారు. కానీ అది జి.హెచ్.యం.సి.కి చెందిన స్థలమని అధికారులు వాదిస్తున్నారు. ఇంతకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం, ఆ సమయంలో డికె. అరుణ మంత్రిగా ఉండటంతో జి.హెచ్.యం.సి.అధికారులు ఆ స్థలం జోలికి వెళ్ళే సాహసం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత ఇటువంటి కబ్జా భూములన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు.