ప్రాంతీయ రాగాలకు స్వస్తి :
సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ ప్రచారం ప్రధానంగా చేసుకోవాలన్న వ్యూహాలు వెనక్కుపోవడం గ్రేటర్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన మంచి పరిణామం. ఎందుకంటే ఒకసారి విభజన జరిగాక హైదరాబాదులో వుండేవారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరిది ఏ జిల్లా అనే చర్చ అప్రస్తుతమే. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారూ ఇతర దేశాల వారు కూడా వున్నారు. అలాగే మతాలవారి చూడ్డం కూడా తప్పే. విభజనానంతరం రోజువారి జీవితంలో ఆ తరహా వాతావరణం లేదు కూడా. తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అందుకే ఎన్నికలు అనగానే టిఆర్ఎస్ మంత్రి కెటిఆర్ సీమాంధ్ర ఓటర్లను మంచి చేసుకోవడంపై కేంద్రీకరించారు. వారి విశ్వాసం పొందేందుకు కొంచెం ఎక్కువగా దూరమే వెళ్లి పార్టీ పేరు మార్చుకోవడం వరకూ మాట్లాడారు. తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు ఆ మాటలు నమ్మవద్దని సీమాంధ్ర ఓటర్లకు చెప్పడానికి ప్రాధాన్యత నిచ్చారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వంటివారు మరీ తీవ్రంగానే వ్యవహరించారని చెప్పాలి. మాకిద్దరికీ దీనిపై ఒక ఛానల్లో వాదన జరిగినప్పుడు నేను గట్టిగా విభేదించాను.
కాంగ్రెస్‌కు మౌలికంగానే ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రాంతీయ కోణాలు రగిలించడం బాగా అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కార్డు తప్ప మరొకటి లేదని వారు బాహాటంగానే చెబుతున్నారు. బిజెపికి మజ్లిస్ కోణం ముఖ్యం గనక మతపరమైన భాషణం తప్ప ఈ తరహాను ఆశ్రయించలేదు. మొత్తంపైన మొదటి దశలో మొత్తంగా సీమాంధ్ర ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనేదానిపైనే చర్చ నడిచింది.
తెలంగాణ రావాలని కోరుకునేవారైనా విభజన వద్దనే వారైనా ఏ దశలో ఎవరు కూడా ప్రాంతీయ చిచ్చును హర్షించలేదు. లేకపోతే ఉద్రిక్తతలు పెరిగి వుండేవి. అప్పట్లో నేనైతే ఎవరేమిటో తెలిసిన ప్రజలు రెచ్చిపోరని గట్టిగా చెబుతుండేవాణ్ని. అప్పుడే లేనిది ఇప్పుడు అన్నీ అంత తేలిగ్గా ప్రజలు ప్రాంతీయ కోణాలకు పరిమితమవుతారనుకోవడం కొందరి అత్యాశ. తియ్యటి మాటలతోనే మొత్తం మారిపోతారనుకోవడం కూడా అత్యాశే. నగర సమస్యలు, డివిజన్ల స్థానిక అంశాలు, అభ్యర్థుల పూర్వాపరాలు ఓట్ల విభజన వంటివి కీలకమవుతాయి.. పై తరగతులు వాళ్లు పనులు జరగాలనీ, కింది తరగతుల వాళ్లు అవసరాలు తీరాలని అధికార పక్షాన్ని ఆశ్రయించడం ఎలాగూ జరుగుతుంటుంది.
సీట్ల లెక్కలతో కుస్తీ :
నగరంలో బిజెపి టిడిపి కూటమి ప్రధాన శక్తిగా వుంటుందనే అంచనాలు మారడానికి వాటి అంతర్గత సమస్యలు ప్రధాన కారణమైనాయి. రేవంత్‌రెడ్డిపై బిజెపి కార్యకర్తలు అంతగా విరుచుకుపడ్డంలో చాలా సంకేతాలున్నాయి. ఓటుకు నోటు ముద్ర తమపై పడకుండా చేసుకోవాలన్న వ్యూహం కూడా దానిలో వుంది. మరోవైపున లోకేష్ ఆయనను తెలంగాణ టైగర్ అని ఆకాశానికెత్తడంలో వారిద్దరి సాన్నిహిత్యం ఓటుకు నోటు ఎపిసోడ్లో భాగస్వామ్యం ప్రభావం కూడా వుంది. హైదరాబాదులో టిడిపి బిజెపిలు ప్రధాన శక్తిగా వస్తాయనే భావం గత కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలను బట్టి ఏర్పడి వుంటే ఇప్పుడు వాటికవే ఆ పరిస్థితిని పోగొట్టుకున్నాయి. తెలుగుదేశం తీసుకొచ్చిన సీమాంధ్ర వైరుధ్యం, బిజెపికి అలవాటైన ముస్లిం మజ్లిస్ వ్యతిరేక కోణం ఎన్నికల్లో ప్రధానం కాకుండా పోయాయి. 12 సీట్లు మాలో మేము పోటీపడి టిఆర్ఎస్కు ఇస్తున్నామని బిజెపి ప్రతినిధి ఒకరు మాతో అన్నారంటే పరిస్థితి తెలుస్తుంది. తెలుగుదేశంలో అనాసక్తిపై నేను మొదట్లో రాసింది కృష్ణయాదవ్ వంటి వారి నిష్క్రమణతో రుజువైంది. దేవేందర్ గౌడ్ కుటుంబాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకోలేదనే అసంతృప్తి తెలుగుదేశం వర్గాల్లో వుంది. అందుకే ఈ కూటమిది రాజకీయ పోటీ తప్ప రణశంఖం పూరించడం లేదు.
టిఆర్ఎస్లోనూ క్షేత్రస్థాయిలో చాలా లోపాలున్నాయి. కెటిఆర్,కవిత లేదా మంత్రులు జరిపిన పర్యటనలు ప్రచారాలు తప్ప నిర్మాణ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోలేకపోయారు. నగరంపై నమ్మకం లేక మొదటి ఏడాది పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎన్నికల ముందు హడావుడి మొదలు పెట్టారనే విమర్శ కూడా వుంది. హరీష్ రావును పూర్తిగా దూరం పెట్టడంపై ఆయన శిబిరంలో అసంతృప్తి వుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ మొదటి నుంచివున్నవారికి మధ్య కూడా దూరం వుంది. కెటిఆర్ చాలామందిని బుజ్జగించినా తిరుగుబాటుదార్లు బాగానే మిగిలడానికి అదొక కారణం. ఓటర్ల సంఖ్య తక్కువే గనక కొద్దిపాటి చీలిక కూడా గెలుపు ఓటములకు దారితీస్తుంది.
కాంగ్రెస్‌కు సంప్రదాయికంగా వున్న పునాదిని బట్టి ఏవో కొన్ని స్థానాలు రావల్సిందేగాని పెద్ద ప్రభావం వుండదనే ఆ పార్టీ నేతలతో సహా భావిస్తున్నారు. మిగిలిన ఎవరికంటే ముందే వారొక్కరే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం అందుకే ఎవరూ పట్టించుకోని విషయమైంది.
మిగిలిన పార్టీలన్నీ ఒకటే విధంగా వున్నాయిగనక మేమొక్కరమే ప్రత్యామ్నాయమన్నది సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా, ఎంసిపిఐలతో కూడిన వన్హైదరాబాద్ కూటమి చెబుతున్న మాట. నగరాభివృద్ధిపై ఈ కూటమి కొన్ని నిర్దిష్ట సూచనలు కూడా చేస్తున్నది. కొన్ని డివిజన్లలో ముఖ్యంగా శివారు ప్రాంతాలలో దీని ప్రభావం ఎన్నికలపై వుంటుంది. కాని ఒకటి రెండు సీట్లయినా వస్తాయని చెప్పలేకపోతున్నారు.
ఇంతకూ ఎవరికి ఎన్ని వస్తాయనే లెక్కలు చెబుతున్నారు గాని దానికి ప్రాతిపదిక ఏమీ లేదు. ఇతరులకు రావన్నది మాత్రం గట్టిగా అంటున్నారు. టిఆర్ఎస్కు వంద వస్తాయని కెటిఆర్ కూడా నమ్మడం లేదు గనకే ఆ పాయింటుపై రాజీనామా సవాలు తీసుకోలేదు. 70-80 వస్తాయని మొదట్లో చెప్పారు. ఎన్టివి సర్వే కూడా అదే చెప్పింది. ఏమైనా చివరకు మొత్తం వాతావరణం మీద ఆధారపడి 40 నుంచి 60 మధ్య రావచ్చని ఎక్కువ మంది అనుకుంటున్నారు. టిడిపి బిజెపి కూటమి 25-30 మించి ఆశించే స్థితి లేదు. మజ్లిస్‌కు 30-40 మధ్య లెక్క వేస్తున్నారు. కాంగ్రెస్‌కు 10-15 మించి రావన్న అంచనాలు చెబుతున్నారు. వీటిని తలకిందులు చేసి అన్నీ ఒకవైపే వెళ్లేంత ప్రభంజనం ఎవరూ వూహించడం లేదు. చివరకు ఓటరు మహాశయులే తేలుస్తారు.