ఎన్నికలంటే చాలు… మంచి దూకుడు మీద ఉంటుంది తెరాస! ఎందుకంటే, వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తూ వస్తోంది. కొద్దిరోజుల కిందటే మున్సిపల్ ఎన్నికల హడావుడి కూడా ముగిసింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కి ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. గ్రేటర్ ఎన్నికలకు ఇంకొంత సమయం కూడా ఉంది. అయితే, వీటిని ముందస్తుగా నిర్వహిస్తే ఎలా ఉంటుందీ అనే ప్రతిపాదన తెరాస వర్గాల్లో చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ముందస్తుగా వెళ్లడమే పార్టీకి కలిసొచ్చిందనే సెంటిమెంటు కూడా ఉంది.
ఈ ఉద్దేశంతోనే ఈ మధ్య గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ కార్యక్రమాలు కాస్త వేగవంతం చేసింది అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బస్తీ దవాఖానాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారు. 123 ఉన్న సంఖ్యను మరింత పెంచారు, ముందుల అందుబాటుని కూడా పెంచాలని సీఎం ఆదేశించారు. కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. తెరాస నాయకుల్ని కూడా నిత్యం ప్రజల్లోనే ఉండాలంటూ మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీపరంగా చూసుకుంటే… ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుండి నడిపిస్తారు. గత ఎన్నికల్లో 99 స్థానాలు ఆయన నాయకత్వంలోనే తెరాస దక్కించుకుంది. ఇప్పుడు కూడా అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నారు. పార్టీపరంగా సెటిలర్స్ ని దగ్గర చేసుకోవడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో స్నేహపూర్వకంగా ఉంటున్నామనే సంకేతాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్రులను ఆకర్షించే ప్రయత్నాలు ఇప్పుటికే చేస్తున్నారు. త్వరలో, గతంలో మాదిరిగానే సెటిలర్లతో సమావేశాలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
పరిస్థితులు అన్నిరకాలుగా సానుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఇలాంటి సమయంలోనే ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే తెరాస వర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యం నుంచి ఇంకా కోలుకోలేదు. గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందిలే అనే ధీమాతో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలు అంటే విపక్ష పార్టీలు వెంటనే సిద్ధం కావడం కాస్త కష్టమైన పనే అవుతుంది. ఇవన్నీ తెరాస అధినాయత్వంలో చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి… అంతిమంగా కేసీఆర్, కేటీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో?