గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను ఇక పోటీ చేయనని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని అసలు రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నా రాంబాబు నిర్ణయం సంచలనంగా మారింది. తనను వైసీపీలో రెడ్డి సామాజికవర్గం పూర్తిగా అన్యాయం చేసిందని టీడీపీలో చేరాలని అనుకుంటున్నానని ఆయన తన అనుచరులతో చెప్పినట్లుగా రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అన్నా రాంబాబు విజయం సాధించారు. ఆయనకు 81 వేల మెజార్టీ వచ్చింది. 2009లో ప్రజారాజ్యం తరపున అన్నా రాంబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. పార్టీలో ముఖ్య సామాజికవర్గం నన్ను లక్ష్యంగా చేసుకుందని.. ఆ సామాజికవర్గం నన్ను చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. జిల్లా పార్టీ నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.
ఇప్పుడు అన్నా రాంబాబు సైతం అదే బాటలో నడుస్తున్నారు. అయితే ఆయన మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని..మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని రాంబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు నంచి పోటీ చేయమని.. బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ చెబుతున్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది.