శుక్రవారం సాయింత్రం హెచ్ఎంటివి ఛానల్లో విజయమాల్యా పలాయనం, తర్వాత వైసీపీ అవిశ్వాస తీర్మానం గురించి చర్చ జరిగింది. జూపూడి ప్రభాకరరావు, జోగు రమేష్,నేను పాల్గొన్నాము. మధ్యలో మాజీ మంత్రి శైలజానాథ్ ఫోన్లో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ప్రతిపక్షం హక్కు, సంప్రదాయం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక వాగ్దానాల అమలులో విఫలమైనా, రుణమాఫీ వంటివి పాక్షికంగానే అమలు చేసినా ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తీవ్ర వ్యతిరేకతగా మారిందని చెప్పలేమని నేనన్నాను. వైసీపీ నుంచి ఫిరాయింపుల నేపథ్యంలో తమ బలాన్ని చూసుకోవడానికి కూడా ఈ చర్చతీసుకుని వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సభలో ఇప్పటి వరకూ ప్రతిపక్షం పాత్రను ప్రభుత్వం గట్టెక్కిపోతున్న తీరును చూస్తే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పాను. శైలజానాథ్ కూడా అలాటి అభిప్రాయమే వెలిబుచ్చారు.
జూపూడి ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేస్తున్నదని చెబుతూ వైసీపీకి గనక విశ్వాసముంటే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లవచ్చని సవాలు విసిరారు. ఈ దశలో పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అనుకోకుండా లైన్లోకి వచ్చి సోమవారం నేను రాజీనామా చేస్తాను మీరు సిద్ధమేనా…అని సవాలు చేశారు. తనపై ఎవరినైనా పోటీ పెట్టొచ్చు గాని తాను గెలిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని అడిగారు. చర్చ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ కూడా ఆమెను అభినందించి జూపూడి ప్రతిస్పందన కోరడంతో ఆసక్తికరంగా మారింది. దళితులు గిరిజనులే ఎందుకు రాజీనామా చేయాలి, మీరు కాదు మీ నాయకుడి నుంచి రావాలి అని ఆయన అన్నారు గాని వాటికి అంత తీవ్రత రాలేదు. అనుకోని ఈ సవాలుతో చర్చ ముగిసింది.