హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల నరుకుతానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిన్న విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో నిన్న జరిగిన బహిరంగసభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న ఈ సభలో ఈశ్వరి రెచ్చిపోయి చంద్రబాబుపై తీవ్రపరుషపదజాలంతో విమర్శలు గుప్పించారు. వాడు, వీడు అని సంబోధిస్తూ చంద్రబాబు బాక్సైట్ జోలికొస్తే గిరిజనుల సంప్రదాయ ఆయుధాలతో తల నరుకుతామని అన్నారు. అత్యంత విలువైన ఖనిజ సంపదను దోచుకోవటానికి వస్తున్నాడని, వాడు నరరూప రాక్షసుడు, వెన్నుపోటుదారు, దగాకోరు అంటూ మండిపడ్డారు. ఇటీవల ఏజెన్సీలో ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని, పార్టీ జెండా మోసిన ఆ గిరిజనులకు కష్టం వస్తే కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు సవాల్ కూడా విసిరారు. బాక్సైట్‌ను రిఫరెండంగా తీసుకోవాలని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, టీడీపీ అధినేత ముందుకొచ్చి పాడేరులో వారి పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అన్నారు. టీడీపీ అభ్యర్థి గెలవటం కాదుకదా, కనీసం డిపాజిట్ దక్కించుకున్నా రాజకీయ సన్యాసం స్వీకరిస్తానన్నారు. అలా కాకపోతే సీఎమ్ పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. గిరిజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రి రావెల, ఆదివాసీ ఆవేశానికి గురికాక తప్పదన్నారు. గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా అంటూ జగన్ పై విమర్శలు చేస్తున్న అరకు ఎంపీ గీత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.