చాలీ చాలని జీవితం..
గంజి బువ్వే.. పరమాన్నం!
కూలీకి ఎవరైనా పిలిస్తే చాలు – అంటూ గుమ్మం బయటే ఎదురు చూపులు.
చదువైనా అబ్బిందా అంటే.. అదీ లేదు.
పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. ఒఠ్టి నిశానీ బ్యాచీ.
కానీ.. తానిప్పుడో సెలబ్రెటీ. ఆమె పాటకు తెలుగు ప్రజలంతా అభిమానులైపోయారు. చిరంజీవి సైతం… ఇంటికి తీసుకెళ్లి చీరా సారె పెట్టి పంపారు. రెహమాన్ లాంటి సంగీత కారుడు ‘ఎవరామె’ అంటూ ఆరా తీశాడు. జానకమ్మ.. ఆమెని పిలిపించుకుని పులకించిపోయింది. కూలీ నుంచి కూనలమ్మ వరకూ ఎదిగిన ఆమె ఎవరో కాదు.. పలాస బేబీ! ఇప్పుడామె పల్లెటూరి కోయిలమ్మ.. తెలుగు సినిమా పాటకు కొత్తగా దొరికిన వరాల బొమ్మ, స్వరాల కొమ్మ!
ఓ చిన్న వాట్సప్ వీడియో ఇప్పుడామెని స్టార్‌ని చేసేసింది. ఎప్పుడూ పాడుకునే పాటే.. వీడియోకెక్కి – విశ్వ వ్యాప్తమైంది. తెలుగు ప్రజలంతా.. ‘ఈమె ఎవరో గానీ.. బాగా పాడిందే’ అంటూ ఆ గాత్ర సౌందర్యానికి దోసోహం అయిపోతే.. సంగీత కారులు ఆమెని వెదికి పట్టుకొచ్చి.. గాయనిగా మార్చేంత వరకూ నిద్రపోలేదు. బేబీ ఇప్పుడు తెలుగు సినిమాకి దొరికిన కొత్త గాయని.
బేబీ జీవితం, ఆమె ప్రస్థానం తెలుసుకుంటే.. విస్తుబోతారంతా. తూర్పుగోదావరి జిల్లాలోని వడిశలేరు అనే గ్రామంలో పుట్టిందామె. చదువు అబ్బలేదు. పదమూడో ఏటే.. పెళ్లయిపోయింది. కూలీనే జీవనాధారం. ఒక్కోసారి కూలీ దక్కకపోతే… పక్కింటికో, ఎదురింటికో వెళ్లి.. గంజి తెచ్చుకుని, దాన్నే పరమాన్నంగా భావించి, కడుపు నింపుకునేది. అయితే ఆ చుట్టు పక్కల వాళ్లకు మాత్రం బేబీ బాగా ఫేమస్. ‘కూలీని రా.. కానీ పనిచేయకు.. ఓ పాట పాడంతే’ అంటూ… ఆమెని ఆహ్వానించేవారు. బేబీ పనేంటంటే… కూలీకి వెళ్లి.. వాళ్లతో పాటు ఉండి.. రోజుంతా పాటలు పాడి రావడం. ఆమె పాట వింటూ.. కూలీలంతా అలసట మరచి… పనులు చేసుకునేవారు.
అలాగని బేబీకి సంగీతం వచ్చా అంటే అదీ రాదు. కానీ ఆమె సహజ గాయని. ఓ పాట విన్నదంటే.. పట్టేసుకుంటుంది. మనసులో దాచేసుకుంటుంది. తీరిగ్గా ఉన్నప్పుడు మళ్లీ మళ్లీ పాడుకుని.. ఆ రాగాన్నీ, భావాన్నీ తన సొంతం చేసేసుకుంటుంది. అలానే.. పాటల్ని నేర్చుకుంది. నిజానికి ఇది వరకు సినిమా పాటలు చాలా తక్కువగా పాడేదట. జానపద గీతాలు, పల్లె పదాలే ఎక్కువగా ఆలపించేది. ఎప్పుడైతే… వాట్పస్ ద్వారా బేబీ పాపులర్ అయ్యిందో.. అప్పటి నుంచీ.. ఆమెని ‘ఏదైనా సినిమా పాట పాడొచ్చు కదా’ అని అడుగుతున్నారంతా. దాని కోసం.. సినిమా పాటలు నేర్చుకుని మరీ పాడుతోంది.
సురేఖ బేబీ గురించి తెలుసుకుని… ‘బేబీని మన ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేయండి’ అంటూ సంగీత దర్శకుడు కోటిని కోరారు. కోటి వెంటనే.. బేబీ గురించి ఆచూకీ తీసి, ఆమెను తీసుకురావడానికి ఓ వ్యక్తిని పంపి, కొత్తబట్టలు కొనిచ్చి, స్వయంగా తనే చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చారు. బోల్ బేబీ బోల్ అనే టీవీ కార్యక్రమంలో బేబీతో పాట పాడించారు. వెంటనే మరో సంగీత దర్శకుడు రఘు కుంచె కూడా బేబీతో ఓ పాట పాడించారు. జానకమ్మ బేబీ గురించి తెలుసుకుని, పిలిపించి మరీ మాట్లాడారు. ఇంతకంటే.. బేబీ గురించి ఏం చెప్పాలి? త్వరలో ఆమె రెహమాన్ స్వర సారథ్యంలో ఓ పాట పాడబోతోంది. అంతేకాదు.. దుబాయ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో బేబీతో పాట పాడించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
https://youtu.be/f6iAGNE4IE0
”బేబీని ఏ గాయనితోనూ పోల్చలేం. ఆమెదో ప్రత్యేకమైన గొంతు. సంగీతం రాకుండానే ఇంత బాగా పాడడం.. నిజంగా ఓ అద్భుతం. ఆమెకు గానం సహజంగా అబ్బిన లక్షణం” అంటున్నారు కోటి. ఇప్పుడు బేబీ ఫుల్ బిజీ. వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఇప్పుడు బేబీకి కావల్సింది.. సరైన గైడెన్స్. వచ్చిన ప్రతీ పాటా ఒప్పుకోకుండా… తనదైన ముద్ర పడేలా మంచి పాటల్ని ఎంచుకోవాలి. సంగీతానికీ, సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటూ.. తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు చేరువ అయ్యే పాటల్ని ఎంచుకోవాలి. కోటి లాంటి సంగీత దర్శకుడు.. ఆ పర్యవేక్షణ బాధ్యత తీసుకుంటే.. బేబీ పాట.. పది కాలాల పాటు… మన చెవిల్లో మార్మోగుతూ ఉంటుంది.