గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటుగా… జిన్నా కూడా రిలీజ్ కానుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఏకంగా మెగాస్టార్‌పైనే పోటీగా దిగడానికి మంచు విష్ణు సిద్ధమయ్యాడని, అందుకే ఈ రిస్క్ తీసుకొన్నాడని అన్నారు. విష్ణు కూడా ‘అక్టోబరు 5న వస్తున్నా’ అంటూ ఓ హింట్ ఇచ్చాడు. అక్టోబరు 5 దగ్గర పడుతున్నా ఇప్పటి వరకూ ప్రమోషన్లు ప్రారంభించలేదు. సరికదా.. ఇప్పుడు మాట మార్చాడు. “అక్టోబరు 5న వస్తున్నా అన్నా.. కానీ సినిమా రావడం లేదు. ట్రైలర్ వస్తోంది. అక్టోబరు 21న మా సినిమాని విడుదల చేస్తామ“ని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు విష్ణు. ఈరోజు… మీమర్స్, ట్రోలర్స్ తో ఓ మీటింగ్ పెట్టుకొన్నాడు విష్ణు. తనని ట్రోల్ చేసేవాళ్లతో.. ఓ ప్రెస్ మీట్ పెట్టడం బహుశా.. విష్ణుకే సాధ్యమేమో..? ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాడు. దాంతో పాటు.. ట్రోలర్స్‌కి ఓ విన్నపం అంటూ… తన మనసులోని బాధని బయటపెట్టాడు.
“సినిమా బాగాలేకపోతే తిట్టండి.. విమర్శించండి. నేను ఏమీ అనుకోను. కానీ ఫ్యామిలీలను మాత్రం ఇందులోకి లాక్కండి. ప్రతీ ఒక్కరికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి“ అని మీమర్స్‌ని కోరాడు విష్ణు. అన్నట్టు ఈ సినిమా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. కన్నడ, తమిళ సీమల్ని విష్ణు ఎందుకు వదిలేశాడో మరి.