విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఇచ్చిన భూములను ఏపీ సర్కార్ భిన్నమైన ప్రయోజనాల కోసం వెనక్కి తీసుకుంటోంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా పంచేయాలని నిర్ణయించడమే తాజాగా.. గిరిజన వర్శిటీకి ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడం కలకలం రేపుతోంది. విభజన చట్టంలో భాగంగా.. గిరిజన వర్శిటీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. బోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా.. విజయనగరం జిల్లా కొత్తవలసం మండలంలోని అప్పన్నదొర పాలెం అనే గ్రామంలో ఏపీ సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఆ భూమి గుర్తిస్తూ.. అక్కడ గిరిజన వర్శిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. మొదటి దశ పనులకు రూ.420 కోట్లు కేటాయించింది. అయితే ఇప్పుడు ఏపీ సర్కార్… గిరిజన వర్శిటీని బోగాపురం సమీపం నుంచి… ఒడిషా సరిహద్దులకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బయట పెట్టి.. సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొటక్కి గ్రామంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారని.. అలా చేస్తే… ఒరిస్సాలోని కోరాపూర్ కు అతి చేరువుగా యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు ్వుతుందని అంటున్నారు. దీని వల్ల ఏపీ గిరిజన యువతకు ఎలా మేలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతంలోనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆ భూములను.. ట్రైబుల్ వర్శిటీకి గుర్తించి.. నిధులు విడుదల చేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు.. తరలించాలనుకుంటోందన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికే బోగాపురం వినాశ్రాయానికి గత ప్రభుత్వం కేటాయించిన ఐదు వందల ఎకరాలను వెనక్కి తీసుకుని.. మళ్లీ జీఎంఆర్కే కాంట్రాక్ట్ ఇచ్చిన ఏపీ సర్కార్.. అక్కడికి సమీపంలోనే ఉన్న గిరిజన వర్శిటీని తరలించి.. ఆ భూములనూ స్వాధీనం చేసుకోవడం ఖాయమయింది. ఇదంతా.. రాజధాని ఖాతాలో వేసేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. గిరిజన వర్శిటీ తరలింపు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.