ఈరోజు విడుదలైన ఫలానా పరీక్షల్లో టాప్ ర్యాంకర్లంతా మావాళ్లే. ఒకటి ఒకటి రెండు, మూడు మూడు నాలుగు అంటూ ర్యాంకుల లెక్కలు వినిపించే టీవీయాడ్స్ ఇప్పుడు తరచూ చూస్తూనే ఉన్నాం . తెలుగురాష్ట్రాల్లో రకరకాల కోచింగ్ సెంటర్లు చాలా ఎక్కువ. కానీ సరిగా చదువుచెప్పని వారిపై కోర్టుకు వెళ్లిన సందర్భాలు లేవు. మహారాష్ట్రలో అలాకాదు. సరిగా కోచింగ్ ఇవ్వని సెంటర్ పై ఓ విద్యార్థిని కోర్టుకు వెళ్లింది. విజయం సాధించింది.
ముంబైలో అభివ్యక్తి వర్మ అనే పన్నెండో తరగతి విద్యార్థిని లెక్కలు, సైన్స్ లో మంచి కోచింగ్ ఇస్తామని ప్రచారం చేసుకున్న ఓ సెంటర్లో చేరింది. అంధేరి లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ లో కోచింగ్ తీసుకుంది. అయినా ఆ సబ్జెక్టుల్లో మంచి మార్కులు రాలేదు. ఇది 2013లో జరిగింది.
తప్పుడు ప్రచారంతో మోసం చేసిన కోచింగ్ సెంటర్ కు తగిన బుద్ధి చెప్పాలని ఆ విద్యార్థిని, ఆమె తల్లి నిర్ణయించుకున్నారు. వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును వినియోగదారు కోర్టు, ఆ విద్యార్థిని చెల్లించిన 54 వేల రూపాయలను వాపస్ ఇవ్వాలని ఆదేశించింది. ఆ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా 3 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో 10 వేల రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పింది.
విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆరాటం, అనేక కోచింగ్ సెంటర్లకు వరంగా మారింది. ఈ తీర్పు, అలాంటి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం లాంటిదని వినియోగదారుల హక్కుల సంఘాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.