ఆ యువతి తప్పు చేసింది. ఆ తప్పునకు శిక్ష వేయాల్సిన వాళ్లు వేయలేదు. ఇంకెవరో వేశారు. ఫలితంగా మానసిక క్షోభ అనుభవించింది. చివరికి ప్రాణం తీసుకుంది. ఘటకేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి కథ విషాదంగా మారింది. సరిపడని మెడిసిన్స్ మింగి ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్లో బీ ఫార్మసీ చదివే యువతి .. తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ పోలీసులకు సమాచారం అందించింది. విచారణలో పోలీసులు అదంతా అవాస్తవమని .. ఆ యువతి అబద్దాలు చెప్పిందని గుర్తించారు.
అసలు కిడ్నాపే జరగలేదని.. రేప్ అసలే జరగలేదని తేల్చారు. ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే ఆ యువతి వేర్వేరు ప్రాంతాల్లో తిరిగింది. ఆ సమయంలో తల్లి పదే పదే ఫోన్లు చేయడంతో అత్యాచారం అనే నాటకాన్ని ఆడిందని పోలీసులు చెప్పారు. తనకు క్రైమ్ సబ్జెక్ట్స్ ఇష్టమని.. అందుకే అలా చేశానని చెప్పిందన్నారు. దీంతో తప్పుడు ఫిర్యాదు చేసినందుకు పోలీసులు సైతం ఆ యువతిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఘటన జరిగినప్పటి నుంచి యువతి సన్నిహితులు, ఫ్రెండ్స్, బంధువులు అందరి ముందు దోషిగా ఉండటంతో కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. తన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరగడంతో తట్టుకోలేకపోయింది. ఇక బతకడం అనవసరం అని ప్రాణం తీసుకుంది. ఆ యువతి తప్పు చేసింది.. అంత మాత్రానికే మీడియా అతిగా స్పందించడం .. సోషల్ మీడియా లో బాధ్యత లేకుండా పోస్టులు పెట్టడం ఆమె మరణానికి కారణం అయ్యాయి.