ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించడం తలకు మించిన భారం అవుతోంది. మంత్రులో లేకపోతే సీఎం దగ్గర పలుకుబడి ఉన్న వారో అతి కష్టం మీద కొన్ని బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు కానీ ఇతరులకు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఒకరిద్దరు బయటకు చెబుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అదే చెప్పారు… ఇప్పుడు ఆయన బాటలోకి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వచ్చి చేరారు.
కోవరూ నియోజకవర్గంలో ప్రభుత్వ పనులు చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు రూ. నలభై ఐదు కోట్ల బిల్లులు రావాల్సి ఉందని .. కానీ రెండున్నరేళ్ల నుంచి రావట్లేదన్నారు. నాయకులు, కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారని అన్నారు. అయితే ఈ విషయం నేరుగా చెబితే ప్రభు్తవ, పార్టీ పెద్దలకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎమ్మెల్యే తట్టకోగలరా అందుకే ఈ విషయాన్ని అవినీతితో ముడిపెట్టారు. కొంత మంది పార్టీ నేతలు బిల్లులు రాకపోయినా అవినీతికి పాల్పడటం లేదని కానీ మరికొంత మంది మాత్రం తన పేరు చెప్పుకుని పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన అంటున్నారు.
అందుకే బిల్లులు రాకపోయినా నిజాయితీగా ఉంటున్న వారిని ఆదర్శంగా తీసుకుని ఇతర నేతలు లంచాలు తీసుకోవద్దని ప్రజల్ని పీడించవద్దని అడుగుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో పనులు చేసిన పార్టీ నేతలకు బిల్లులు ఇప్పించేది ఎమ్మెల్యేనే. అందుకే వారిపై ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఈ ఒత్తిడి నల్లపురెడ్డికి ఎక్కవైపోయిందేమో కానీ.. మరో రూపంలో అసంతృప్తి బయటకు విడుదల చేశారు. దీన్ని మరి ప్రభుత్వం గుర్తిస్తుందా ?