రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు ప్రచారాలు చేయాలి .. ఇంకా ఎన్నో అడ్డగోలు మార్గాలుంటాయి. వాటన్నింటిని ఎదుర్కొనేందుకు కూడా పోటీలో ఉన్నవారు సిద్ధంగా ఉండాలి. చేతులు కాలిన తర్వాత కుట్రలు చేశారంటూ గగ్గోలు పెడితే ప్రయోజనం ఉండదు. ఏపీలో ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు వ్యవహారం లో అదే కనిపిస్తోంది.
సిమిలర్ గా ఉన్న గుర్తుల్నే వద్దంటారు కదా – నేరుగా గాజు గ్లాస్ గుర్తునే ఎందుకు అనుమతించారు ?
ఫ్యాన్ గుర్తును పోలి ఉండేలా గుర్తు ఏదైనా ఉంటే వైసీపీ అభ్యంతరం చెబుతుంది. సైకిల్ గుర్తును పోలి ఉండేలా ఏదైనా గుర్తు ఉంటే దాన్ని స్వతంత్రులకు కేటాయించవద్దని ఈసీని టీడీపీ అడుగుతుంది..టీడీపీ, వైసీపీనే కాదు ఏ పార్టీ అయినా తమ అధికారిక గుర్తును పోలి ఉండేలా గుర్తులు ఉంటే వాటిని బ్యాన్ చేయమని కోరుతుంది. ఈసీ అంగీకరిస్తుంది కూడా. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరిగింది ?. జనసేన కు ఈసీ అధికారికంగా రిజర్వ్ చేసిన గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీ పోటీ చేయని చోట్ల ఇండిపెండెంట్లకు కేటాయించారు. వైసీపీ నేతలు డమ్మీలుగా నామినేషన్లు వేసిన చోట్ల.. కూటమి రెబల్స్ బరిలో ఉన్న చోట్ల వారికే గాజు గ్లాస్ కేటాయించారు. కూటమి నేతలు గగ్గోలు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఫ్రీ సింబల్స్ కేటగిరిలో గ్లాస్ ఉంది మరి.
ఫ్రీ సింబల్స్ కేటగిరి నుంచి ఎందుకు తీయించుకోలేపోయారు ?
ఈసీ వెబ్ సైట్ లో ఫ్రీ సింబల్స్ ఉన్నాయి. వాటిని చూస్తే అందులో గాజు గ్లాస్ కనిపిస్తోంది. జనసేనపార్టీకి గాజు గ్లాస్ ను రిజర్వ్ చేసింది ఈసీ. జనసేనకు గుర్తింపు లేదు. గుర్తింపు లేదు కాబట్టి గుర్తు రిజర్వ్ చేయరు. కానీ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు రిజర్వ్ చేస్తారు. అలా రిజర్వ్ చేసింది ఫ్రీ సింబల్స్ కేటగిరిలో ఉండకూడదు. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ఈసీకి తెలియదు. అనవసరం కూడా. ఆ పార్టీకి కేటాయించిన గుర్తును రిజర్వ్ చేయాల్సి ఉంది. కానీ అలా చేయలేదు. ఈ విషయాన్ని ఫాలో అప్ చేసుకోవడంలో కూటమి నేతలు ఫెయిలయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి.. గుర్తులు కేటాయించే వరకూ ఫ్రీ సింబల్స్ లో గ్లాస్ ఉందని తెలిసి కూడా .. ఈసీ దగ్గరకు వెళ్లి తమ అభ్యంతరాలు చెప్పలేకపోయారు, ఫలితంగా గాజు గ్లాస్ వ్యూహంలో వైసీపీ సక్సెస్ అయింది.
గాజు గ్లాస్ గుర్తు ఇంపాక్ట్ ఎంత ?
గాజు గ్లాస్ వల్ల కూటమికి ఏమీ నష్టం ఉండదని ప్రజలు అంత అమాయకులు కాదని కూటమి నేతలు సర్ది చెప్పుకోవచ్చు కానీ నష్టం జరగడం ఖాయం. కూకట్ పల్లి అసెంబ్లీలో జాతీయ జనసేన పేరుతో బరిలోకి దిగిన వ్యక్తి గ్లాస్ గుర్తు తీసుకున్నారు. దానికి రెండు వేల ఓట్లు వచ్చాయి. ఆ అభ్యర్థికి కుటుంసభ్యులు కూడా ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ రెండు వేల ఓట్లు వచ్చాయి. అలాగే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లోనూ ఓ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అక్కడ జనసేన .. బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఆ అభ్యర్థికి నాలుగు వేల ఓట్లు వచ్చాయి. ఇవన్నీ జనసేన, బీజేపీకి పడాల్సిన ఓట్లే. అవి ఎక్కువా తక్కువా అన్న విశ్లేషణ పక్కన పెడితే ఎంతో కొంత ఓట్ల నష్టం అయితే జరగడం ఖాయం అనుకోవచ్చు. వంద ఓట్లు అయనా గుర్తు గందరగోళంతో పోతే.. పోయినట్లే.
కొన్ని చోట్ల కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం
టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పని చేసుకుంటున్నాయి. గ్లాస్ గుర్తుకు అందరూ సమిష్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. లోక్ సభకు జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది. అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ గాజుగ్లాస్ గుర్తు కోసం ప్రచారం చేసుకోవాలి. పార్లమెంట్ కు గాజు గ్లాస్ గుర్తుకు… అసెంబ్లీకి వేరే గుర్తుకు వేయాలని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. అలాగే కూటమి తరపున పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఉంటే… జనసేన అభ్యర్థి కాదని చెప్పుకోవాలి. చాలా మంది కుట్ర పూరితంగా గాజు గ్లాస్ గుర్తునుపొందారు కాబట్టి… వారు జనసేన అభ్యర్థులుగానే భ్రమించేలా ప్రచారం చేసుకుంటారు వీటన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంది.