తిరుపతి ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది. జనసేన పార్టీ బరిలో లేనప్పటికీ.. పవన్ కల్యాణ్ వచ్చి మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ… గాజు గ్లాస్ గుర్తు ఈవీఎంలో కనిపించనుంది. జనసేన పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. ఈ కారణంగా గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించకుండా ఉండటం సాధ్యం కాదు. ఇండిపెండెంట్లకు కేటాయిస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించలేకపోయిన బీజేపీ నేతలు.. లైట్ తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత.. అభ్యర్థులకు గుర్తుల ఖరారు తర్వాత ఊరూపేరూలేని ఓ పార్టీ పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.
దీంతో బీజేపీ-జనసేన కూటమికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుపతిలో జనసేన బలంపైనే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. జనసేన ఫ్యాన్స్ అందరూ గాజు గ్లాస్ గుర్తుకే ఫిక్సయి ఉంటారు. ఈవీఎంలో గాజు గ్లాస్ గుర్తు ఉండగా… బీజేపీకి ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తిచూపరు. పవన్ ఫ్యాన్స్‌లో ఎక్కువగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ .. తిరుపతిలో జనసేన పోటీ చేయడం లేదని… బీజేపీకి మద్దతు ఇస్తుందని.. వారి మనసుల్లోకి వెళ్లేలా చెప్పలేకపోతే… బీజేపీకి పడే ఓట్లలో భారీ తరుగుదల కనిపిస్తుంది. అదే జరిగితే పొత్తుతో ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడీ సమస్యను ఎలా ఎదుర్కోవాలా.. అని బీజేపీ – జనసేన మథన పడుతున్నాయి.
ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి.. స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ కాకుండా ఇంకే గుర్తు అయినా కేటాయించేలా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కాబట్టి.. ఈ విషయంలో బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుంటే… సానుకూల ఫలితం వస్తుందని ఆశతో ఉన్నారు. లేకపోతే… బీజేపీ-జనసేన కూటమి మధ్య గాజు గ్లాస్ భారీగా ఓట్లు పొంది.. మొదటికే మోసం తెచ్చినా తేవచ్చొన్న అభిప్రాయం వినిపిస్తోంది.