జనసేన గాజు గ్లాస్ గుర్తు గల్లంతయిందంటూ ఇటీవలి వరకూ జరిగిన ప్రచారానికి ఈసి చె్క పెట్టింది. ఈసీ తాజాగా వెల్లడించిన నివేదికలో జనసేనకు గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈసీ గుర్తింపు పొందడానికి అవసరమైన ఓట్లు, సీట్లను జనసేన గతంలో పొందలేదు. ఈ కారణంగా జనసేన ఇప్పటికీ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీగానే ఉంది. అందుకే గాజు గ్లాస్ గుర్తు ఇవ్వరన్న ప్రచారం జరిగింది. తిరుపతి ఉపఎన్నికల్లో ఆ గుర్తు ఇతరులకు కేటాయించారు కూడా. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. జనసేన పోటీ చేసిన చోటల్లా గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకే ఉంటుంది.
జనసేన పార్టీ ఆర్థికంగా కూడా కాస్త బలంగానే ఉంది. విరాళాల రూపంలో రూ.26.37 కోట్లు వచ్చాయి. గతేడాది వరకు రూ. 22.36 కోట్లుగా ఉన్న జనసేన పార్టీ ఆదాయం ఈ ఏడాది రూ. 26.37 కోట్లకు చేరినట్లుగా ఈసీకి నివేదిక సమర్పించారు. జనసేన పార్టీకి భవనాల రూపంలో రూ. 1.01 కోట్లు, వాహనాలు రూ. 66.37 లక్షలు, ఆఫీస్ఎక్విప్మెంట్ ద్వారా రూ. 56.34లక్షలు, ఇన్సురెన్సుల ద్వారా రూ.95.47 లక్షల ఆదాయం ఉందని, ప్రస్తుతం బ్యాంకులో రూ.7.60 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆదాయ వివరాల్లో చూపించారు.
అయితే రాజకీయ పార్టీ నడపడానికి ఆ మొత్తం సరిపోవు. విరాళాలు చాలా పరిమితంగా జనసేనకు వస్తున్నాయి. ఇటీవల ప్రత్యేకంగా విరాళాల క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనకు.. గుర్తు విషయంలో ఈసీ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. దీంతో ఓ టెన్షన్ తీరిపోయిందనుకోవచ్చు.